హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ భేటీపై తెలుగుదేశం పార్టీ నాయకులు విరుచుకుపడుతుండగా,  స్పష్టత ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. 

కేటీఆర్, జగన్ మధ్య జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని వైసిపి నేతలు చెబుతున్నారు. జగన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చర్చలు జరుపుతారని కూడా వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పోటీ చేయదని, తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ తో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని వైసిపి మరో నేత అంబటి రాంబాబు స్పష్టత ఇచ్చారు.  ఫ్రంట్ కోసం చర్చలు జరిపితే టీడీపి విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. టీడీపి చేస్తే మంచిది, జగన్ చేస్తే తప్పా అని ఆయన అడిగారు.

ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి పనిచేసే వరకు మాత్రమే ఇరు పార్టీలు పరిమితమవుతాయని వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములయ్యే ఇతర పార్టీల నేతలతో పాటే కేసీఆర్ కూడా ఎపిలో ప్రచారం చేస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మాత్రమే కేసీఆర్ ఎపిలో ప్రచారం సాగిస్తారని వారంటున్నారు. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ కావడం ప్రారంభం మాత్రమేనని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపారని ఆయన సమావేశానంతరం మీడియాతో అన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు.

రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదని ఆయన వివరణ ఇచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయని చెప్పారు. 
ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదని ఆయన స్పష్టం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని చెప్పారు.

కాగా, ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కేసీఆర్, జగన్ వేదిక పంచుకునే అవకాశం ఉందని వైసిపి మాజీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి చెప్పారు. ఎపిలో కేసీఆర్ ప్రచారం చేస్తారని కూడా ఆయన అన్నారు.