ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీకార రాజకీయాలు సాగిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. పీఆర్సీ కోసం ప్రభుత్వానికి ఎదురుతిరిగినందుకు ఉపాధ్యాయులపై ప్రతీకారం తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) చివరకు వేసవి సెలవులను కూడా పగా ప్రతీకారం తీర్చుకునే సాధనంగా వాడుకుంటున్నాడని మాజీ మంత్రి కేఎస్ జవహర్ (KS Jawahar) ఆందోళన వ్యక్తం చేసారు. పిఆర్సీ (PRC) సమయంలో ఉపాద్యాయులు ప్రభుత్వం పై చేసిన ధర్నాకు ప్రతీకారంగానే మే నెలలో బడులు కొనసాగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేకభావం వుందని మాజీ మంత్రి మండిపడ్డారు.
''వైసిపి (YSRCP) ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో గందరగోళం సృష్టిస్తోంది. ఇదివరకు ఆంగ్ల మాధ్యమం పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కొంతకాలం గందరగోళంలోకి నెట్టారు. బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ కు మంగళం పాడారు. విదేశీ విద్య ఆనవాళ్ళు మాయమయ్యాయి. విద్యా దీవెన 2 సంవత్సరాలకే పరిమితం చేసారు'' అని ఆరోపించారు.
''ఉపాధ్యాయులకు డిఏ ఏరియర్స్ కు ఖజానా ఖాళీ చేసారు. పిఎఫ్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వం ఖాళీ చేసింది. వారంలోనే రద్దు చేస్తానన్న సిపిఎస్ అతి గతి లేదు. ఇప్పటికే కరోనాకు చాలామంది ఉపాద్యాయులు బలైపోయారు. ఇప్పుడు వేసవి బడులతో సీఎం జగన్ మరికొందరిని బలి చేయాలని చూస్తున్నాడు'' అని మండిపడ్డారు.
''అసలు వెకేషన్ డిపార్టుమెంట్, నాన్ వెకేషన్ డిపార్టుమెంట్ కు సీఎం జగన్‌కు తేడా తెలియదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఏదో ఉద్దరిస్తున్నట్లు ఆర్భాటంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించి ఇప్పుడేమో ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఎందుకో జగన్ చెప్పాలి? ఇప్పుడు వేసనవి బడుల పేరిట సీఎం జగన్ ఉపాద్యాయులపై ప్రతీకారం చూపడం సరికాదు'' అని మాజీ మంత్రి జవహర్ అన్నారు.
