సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందెలా కోసం ఎదురు చూస్తున్న పందెం రాయుళ్ళకు వార్నింగ్ ఇచ్చారు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన సంప్రదాయాల పేరుతో మూగ జీవాలను అత్యంత క్రూరంగా హింసిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు. జిల్లాలో గత ఏడు రోజుల నుండి పేకాట, కోడిపందేల స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

370 పేకాట కేసులలో 370 మందిని 16 కోడి పందేల కేసులలో 66 మందిని అరెస్ట్ చేసామని రవీంద్రబాబు ప్రకటించారు. అలాగే 16 పందెం కోళ్ళు,1238 కోడికత్తులు, 26 బైకులు, 49 సెల్ ఫోనులు, 2 కౌంటింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఘంటసాలలో 178, మైలవరంలో 294, విస్సన్నపేటలో 96 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని జూదానికి దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రవీంద్ర బాబు హెచ్చరించారు.