ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి... ప్రతిపక్ష కూటమి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ఇలా తూర్పు గోదావరి జిల్లాలోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి ... కొవ్వూరు నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే వుంది.  

కొవ్వూరు రాజకీయాలు : 

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కొవ్వూరు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వనిత మరోచోటికి మార్చి కొవ్వూరులో తలారి వెంకట్రావును బరిలోకి దింపి సొంత పార్టీ నాయకులనే ఆశ్చరపర్చారు అధినేత వైఎస్ జగన్. వనితను మరో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం గోపాలపురంకు పంపించారు.

ఇదిలావుంటే కొవ్వూరు టిడిపికి కంచుకోట అని చెప్పాలి. టిడిపి ఆవిర్భావం నుండి ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(కేవలం రెండుసార్లు మినహా) టిడిపిదే హవా. 1983లో మొదటిసారి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన పెండ్యాల వెంకట కృష్ణారావు ఆ తర్వాత వరుసగా 1985, 1989, 1994,2004 లోనూ విజయకేతనం ఎగరేసారు. ఇక 2009 లో టిడి రామారావు, 2014 లో కెఎస్ జవహర్ కొవ్వూరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇలా టిడిపికి మంచి పట్టున్న కొవ్వూరులో 2019 లో వైసిపిని గెలిపించిన తానేటి వనిత ప్రస్తుతం కీలకమైన హోంమంత్రి పదవిలో వున్నారు. 

కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. చాగల్లు 
2. తాళ్లపూడి 
3. కొవ్వూరు

కొవ్వూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 1,76,505

పురుషులు - 86,228
మహిళలు ‌- 90,267

కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కొవ్వూరులో ఈసారి వైసిపి ప్రయోగం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న హోమంత్రి తానేటి వనితను మార్చి తలారి వెంకట్రావును కొవ్వూరు సీటు కేటాయించింది వైసిపి అదిష్టానం. 

టిడిపి అభ్యర్థి :

కొవ్వూరు టిడిపి అభ్యర్థి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదటిలిస్ట్ లో ఈ నియోజకర్గ అభ్యర్థి పేరులేదు... దీంతో ఇక్కడినుండి బరిలోకి దిగేదెవరో తేలలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్ మళ్లీ ఈ సీటును ఆశిస్తున్న టిడిపి తీరుచూస్తుంటే ఆయన పోటీ అనుమానంగానే కనిపిస్తోంది.

కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,52,611 (86 శాతం)

వైసిపి - తానేటి వనిత - 79,892 (52 శాతం) ‌ - 25,248 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

టిడిపి - వంగలపూడి అనిత - 54,644 (35 శాతం) - ఓటమి 


కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,43,910 (85 శాతం)

 టిడిపి - కొత్తపల్లి శామ్యూల్ జవహర్- 74,661 (51 శాతం) - 12,745 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - తానేటి వనిత - 61,916 (43 శాతం) - ఓటమి