అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో స్థాపించిన కియా మోటార్స్ ప్లాంట్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరింత ఊరట లభించింది. కియా మోటార్స్ కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందన్న ప్రచారాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా-ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కోట్రా) సంస్థ ఖండించింది. 

 కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని కోట్రా స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి  సంపూర్ణ సహకారం, మద్దతు ఉన్నాయని స్పష్టం చేసింది. పరిశ్రమ గమ్యస్థానాన్ని మార్చవలసిన అవసరం గానీ అవకాశం గానీ లేదని కోట్రా కుండబద్దలు కొట్టింది.  ఆసియా కమ్యూనిటీ న్యూస్ (ఎసిఎన్) నెట్‌వర్క్‌ కియా తరలిపోతుందన్న కథనం రాయడంతో  కోట్రా దాన్ని ఖండించింది. దానిపై స్పష్టత ఇస్తూ కోట్రా మరో ప్రకటన విడుదల చేసింది.

కియా మోటార్స్ ప్లాంట్ ను ఏపీ నుంచి తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రాయిటర్స్ రాసిన వార్తాకథనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సంస్థ కూడా ఖండించింది. రాయిటర్స్ వార్తాకథనంపై కియా మోటార్స్ ఎండీ కుక్ యున్ షిమ్ అప్పట్లో స్పందించారు. 

దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో కియా యూనిట్ ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి కార్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం ఉందని, తప్పుడు వార్తలు రాసిన రాయిటర్స్ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు గతంలో ఓ లేఖ కూడా రాశారు. అయితే, తమ వార్తాకథనానికి కట్టుబడి ఉన్నామని రాయిటర్స్ తెలిపింది.