Asianet News TeluguAsianet News Telugu

పార్టీ కోసం కోట్లు ఖర్చు చేశా: జగన్ కు నేత షాకిస్తారా?

ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నవిభేధాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా కొండపి నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త నియామకం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను కాదని మరొకరికి నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించడంతో మాజీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుగుబాటు ప్రకటించారు. 

Kondapi YSR Congress revolts on leadership
Author
Prakasam, First Published Aug 31, 2018, 6:42 PM IST

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నవిభేధాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా కొండపి నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త నియామకం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను కాదని మరొకరికి నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించడంతో మాజీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుగుబాటు ప్రకటించారు. 

కొడపి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా వరికూటి అశోక్ పని చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు. అయితే నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అవ్వడంతో వరికూటి అశోక్ ను సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా డా.వెంకయ్యను నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తనకే మళ్లీ సమన్వయకర్త పదవి వస్తుందని ఆశించిన వరికూటి అశోక్ ఆశలను ఆవిరి చేస్తూ వెంకయ్యను సమన్వయ కర్తగా నియమించడంతో కంగుతిన్నారు అశోక్.  

తన మద్దతు దారులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అవసరమైతే రెబెల్ గా అయినా పోటీ చెయ్యాలని అశోక్ అనుచరులు ఒత్తిడి తేవడంతో తిరుగు బాహుటా ఎగురవేశారు. రాబోయే ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. 

పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టానని కనీసం దయలేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వైవీ తనను మోసం చేశారంటూ విమర్శించారు. నాలుగేళ్లుగా పార్టీకోసం అహర్నిశలు శ్రమిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న దళిత నేతను చీట్ చేవారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
గత ఎన్నికలలో బాపట్ల లోక్‌సభకు పోటీ చేసిన తన సోదరుడు డా. అమృతపాణి కూడా పార్టీ కోసం ఖర్చుపెట్టి ఆర్థికంగా నష్ట పోయాడని స్పష్టం చేశారు. ఆయన విషయంలో కూడా పార్టీ కృతజ్ఞత చూపలేదని విమర్శించారు. జిల్లాలో పార్టీపై పెత్తనం కోసం ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు తనను బలితీసుకుందని తెలిపారు.

ఒంగోలులో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డిని విమర్శించడం...తిరుగుబాటు అభ్యర్థిగాపోటీ చేస్తానని ప్రకటించడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. గతంలో అశోక్‌బాబు మద్ధతుదారులు ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆమరణ దీక్షకు దిగటాన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్ఠానం తాజా సంఘటనపై మరింత సీరియస్‌గా ఉంది. పార్టీ కార్యాలయం వద్ద దీక్ష చేసినప్పుడు అధినేత జగన్‌ తీవ్రంగా మండిపడ్డారని.. ప్రస్తుత వివాదం తెలియడంతో ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.  

ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అశోక్‌బాబు మద్దతుదారుల పేరుతో జరుగుతున్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. అశోక్ బాబుకు మద్దతుగా వ్యవహరిస్తున్ననాయకులను గుర్తించి వారిపై వేటు వేసేందుకు పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. కొండపి మండలంలో నాయకత్వం వహిస్తున్నపిచ్చిరెడ్డి, ఆరికట్ల వెంకటేశ్వర్లు, జీవీ వంటి నేతలు అశోక్ బాబు మద్దతు దారులుగా వ్యవహరిస్తూ పార్టీని బలహీన పరుస్తున్నారని అధిష్టానం గుర్తించింది. 


మరోవైపు నియోజకవర్గ ప్రస్తుత సమన్వయ కర్త వెంకయ్య మాత్రం ఇవేమీ తనకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చాపకింద నీరులా వెంకయ్య, అశోక్ వ్యతిరేక వర్గీయులను తనదారిలో తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే అందర్నీ ప్రసన్నం చేసుకున్న వెంకయ్య తన గెలుపుకు సహకరించాలని కోరుతున్నారు. ఒంగోలులోని రిమ్స్‌లో పనిచేసిన సమయంలో డా.వెంకయ్యకు మంచి పరిచయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కాస్త పట్టుందని అందువల్లే ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారని తెలుస్తోంది.   

ఒకవైపు టంగుటూరు, శింగరాయకొండలోని కొందరు బలమైన నాయకులు వెంకయ్యకు అండగా రంగంలోకి దిగుతుంటే అటు వరికూటి అశోక్‌ తన మద్దతుదారులతో అసమ్మతి వర్గం కూడగడుతున్నారు. అయితే అసమ్మతి సెగను చల్లార్చేందుకు డాక్టర్ వెంకయ్య చకచకా పావులు కదుపుతున్నారు. కొడపి నియోజకవర్గంలో వైసీపీలో రాజుకున్న అంతర్గత కుమ్ములాటపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios