తమ కొడుకును విడిపించడానికి ఎన్ వోసీ కోసం జగన్ ను కలవడానికి వచ్చిన కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులను పోలీస్ లు నిర్భంధించారు. 

ముమ్మిడివరం : కోడికత్తి శీనుఅలియాస్ జనుపెల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అమలాపురంలో సీఎం జగన్ సభ నేపథ్యంలో ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వారు వెళుతున్నారు. ఈ క్రమంలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అమలాపురంలో సీఎం సభ ముగిసే వరకు స్టేషన్ లోనే నిర్బంధించారు. అమలాపురంలో సభ ముగిసి ముఖ్యమంత్రి వెళ్ళాక కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను వదిలేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

జనుపెల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడి కత్తి శీను విశాఖ విమానాశ్రయంలో ఎన్నికలకు ముందు జగన్ పై కోడి కత్తితో దాడి చేశాడు. ఈ అభియోగాలపై శ్రీనివాసరావు గత ఐదేళ్లుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ ఘటన తర్వాత నుంచి జనుపెల్లి శ్రీనివాసరావుకు కోడి కత్తి శీను అనే పేరు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సీఎం వైయస్ జగన్ నుండి ఎన్ఓసి ఇప్పించాలి. ఈ విషయం మీదే శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు.. సోదరుడు సుబ్బరాజు శుక్రవారం అమలాపురం బయలుదేరారు.

వైవాహిక జీవితానికి అడ్డువస్తోందని ప్రియురాలు, కూతుర్లను గోదావరిలోకి తోసేసిన ప్రియుడు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకోవాలని.. తమ అభ్యర్థనను చెప్పడానికి అనుమతి కావాలని ముమ్మిడివరం పోలీసులను వారు కోరారు. ముమ్మిడివరం పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వారు సీఎంను కల్పించడానికి అనుమతిని నిరాకరించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి సభ ముగిసే వరకు.. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్లోనే ఉంచేశారు.

సభ ముగిసి, ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను వదిలేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ ఈనెల 8వ తేదీన ముమ్మిడివరం వచ్చారు. అప్పుడు కూడా వీరు కలవడానికి ప్రయత్నించారు. కానీ, అనుమతి లభించలేదు. దీనిమీద శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎంతో పెద్ద పెద్ద నేరాలు చేసిన వారికి కూడా మూడేళ్లకు మించి శిక్ష పడడం లేదు. మా సోదరుడు శ్రీనివాసరావు నేరం చేశాడో లేదో కూడా నిర్ధారణ కాలేదు. కానీ ఐదేళ్లుగా రిమాండ్ ఖైధీగా జైల్లోనే మగ్గిపోతున్నాడు. తాము దళిత సామాజిక వర్గానికి చెందిన పేదవాళ్లం కాబట్టే మా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎన్ఐఏ కోడి కత్తి దాడి వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేసింది. అయినా కూడా తన సోదరుడు శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు కాలేదు. దయచేసి తమ సోదరుడు శ్రీనివాసరావు విడుదలకు సహకరించాలని సుబ్బరాజు కోరాడు.