ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం.. జాతీయ పార్టీల విషయంలో వైసీపీ స్టాండ్ ఇదే..: కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బీఆర్ఎస్ వల్లే తాము నష్టపోయామని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం విడిపోయిందని, తాము నష్టపోయామని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేయాలని.. కేంద్రంలో అధికారంలో రావాలని కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవని అన్నారు. జాతీయ స్థాయిలో ఎలా ఉంటుందో తనకు తెలియదని.. ఏపీలో మాత్రం ప్రభావం ఉండదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్టీ వైసీపీ అని అన్నారు. అంశాల వారీగా మాత్రమే తమ పార్టీ జాతీయ పార్టీలకు మద్దతిస్తుందని చెప్పారు. వైసీపీకి ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.
మరోవైపు గుంటూరులో చంద్రన్న కానుక సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై స్పందించిన కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యమరథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర అని పొద్దున ప్రకటించగానే.. కందుకూరులో రాత్రి 9 గంటలలోపు 8 మంది మరణించారని విమర్శించారు. చంద్రబాబుకు మరో రూపమే శని ఆరోపించారు. శని గ్రహాన్ని మించిన దశమ గ్రహం చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలవుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులను కోరారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని కోరారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఈరోజు ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించి కేసీఆర్ కీలక కామెంట్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.