Kodali Nani: కాంగ్రెస్‌లోకి షర్మిల.. కొడాలి నాని సంచలనం.. ‘జగన్‌కు క్షమాపణలు చెప్పాలి’
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాజశేఖర్ రెడ్డిని దోషిని చేశామని, జగన్‌ను జైలుకు పంపించామని కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరిస్తే ఆ పార్టీకి కొన్ని ఓట్లయినా పడతాయని అన్నారు. సీఎం జగన్‌కు ఆ పార్టీ హైకమాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
YS Sharmila: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడంపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం ఓట్లు కూడా లేవని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిందని కొడలి నాని ఆరోపించారు. ఏపీ ప్రజల హక్కులను గాలికొదిలేసిందని ఫైర్ అయ్యారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆ తర్వాత దోషిగా చిత్రించిందని దుయ్యబట్టారు. ఆయన కుమారుడు జగన్‌ను జైలు పాలు చేసిందని ఫైర్ అయ్యారు. ఈ రెండు కారణాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధోపాతాళానికి వెళ్లిందని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయననే ముద్దాయిగా చూపించిందని కొడాలి నాని ఆగ్రహించారు. జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టి అగచాట్లకు గురి చేసిందని పేర్కొన్నారు. అందువల్లే కాంగ్రెస్ దిక్కుమాలిన స్థితికి జారిపోయిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దోషిగా చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇదే రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే సీఎం జగన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Mudragada: కాపు నేత ముద్రగడకు వైసీపీ షాక్? ఊరించి ఉసూరుమనిపించిందా?
రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దోషిని చేశామని, జగన్‌నూ జైల్లో పెట్టామని కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోవాలని, ఏపీ ప్రజలకు అన్యాయం చేశామనీ క్షమాపణలు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. అలా క్షమాపణలు చెబితేనే కాంగ్రెస్ పార్టీకి కొన్నైనా ఓట్లు పడతాయని, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదని పరోక్షంగా వైఎస్ షర్మిల రెడ్డిని పేర్కొంటూ కామెంట్ చేశారు.