విశాఖపట్టణం: మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సీపీఎంలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.  మూడు రోజుల క్రితం కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో  కీలక పాత్ర పోషిస్తానని ఆయన చెప్పారు.  టీడీపీలో కిషోర్ చంద్రదేవ్ చేరుతారనే ప్రచారం కూడ సాగుతున్నతరుణంలో  సీపీఎం వైపు కూడ చూస్తున్నారనే  ఊహగానాలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం పనిచేసిన కిషోర్ చంద్రదేవ్  ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ ఫోన్ చేసినా కూడ ఆయన పార్టీలో ఉండనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం పాటు పనిచేసినా కూడ సోషలిస్టు భావాలతో కిషోర్ చంద్రదేవ్ కొనసాగారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్నీ విధించడాన్ని కిషోర్ చంద్రదేవ్ వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుండి ఆయన కాంగ్రెస్ (ఎస్)లో చేరారు.  ఆ తర్వాత తిరిగి ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. 2011లో కేంద్రంలో  అధికారంలో ఉన్న యూపీఏ  ప్రభుత్వంలో  కిషోర్ చంద్రదేవ్ కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా కూడ పనిచేశారు.

కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  తాజాగా సీపీఎంలో చేరేందుకు కూడ ఆయన ఆసక్తిని చూపుతున్నారనే ఊహాగానాలు కూడ వెలువడ్డాయి. వామపక్ష పార్టీల్లో  కిషోర్ చంద్రదేవ్‌కు మిత్రులు ఉన్నారు.

సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ...కిషోర్ చంద్రదేవ్‌కు మంచి మిత్రుడుగా చెబుతుంటారు. సోషలిస్టు భావాలు కలిగిన కిషోర్ చంద్రదేవ్ సీపీఎం వైపు చూస్తున్నారనే చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్రంలో  సీపీఐ, సీపీఎం, జనసేనలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. విశాఖ జిల్లాలో జనసేనతో పాటు వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయి. విశాఖలో పారిశ్రామికవాడలు, ఏజెన్సీ ప్రాంతాలు లెఫ్ట్ పార్టీలకు పట్టుంది. ఈ కారణంగా కూడ కిషోర్ చంద్రదేవ్  సీపీఎం వైపు చూస్తున్నారని అంటున్నారు.

అరకు నుండి 2009లో  కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.2014లో ఈ స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్వతీపురం నుండి ఆయన నాలుగు దఫాలు ఎంపీగా విజయం సాధించారు.

అరకు ఎంపీ స్థానం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేయాలని కిషోర్ చంద్రదేవ్ భావిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే  ఈ నెల 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కిషోర్ చంద్రదేవ్ సీపీఎంలో చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల్లో ప్రచారం సాగుతోంది.ఈ విషయమై కిషోర్ చంద్రదేవ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  అరకు ఎంపీ స్థానం నుండి సీపీఎం పోటీ చేసి గతంలో గణనీయమైన ఓట్లను పొందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు కిషోర్ చంద్రదేవ్ రాజీనామా: సైకిలెక్కుతారా?