మావోయిస్టులపై కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల క్రితం మావోయిలు ఎమ్మెల్యే కిడారిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై పరమేశ్వరి మాట్లాడారు.

‘‘మనం సైలెంట్‌గా ఉన్నంత కాలం మావోయిస్టులు వయలెన్స్‌(హత్యలు) చేస్తూనే వుంటారు. నా భర్త ఆదివారం కూడా కుటుంబాన్ని కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటించే వారు. ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడపడానికి ఇష్టపడేవారు. అటువంటి సేవాభావం ఉన్న తన భర్తతోపాటు మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు ఎందుకు హత్య చేశారు?’’ అని దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి ప్రశ్నించారు. 

సివేరి సోమ సంతాపసభలో పాల్గొన్న ఆమె మొదటిసారి ప్రజల సమక్షంలో తీవ్ర ఉద్వేగంతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు(లివిటిపుట్టు) పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మౌనాన్ని వీడి, ధైర్యంగా నోరు విప్పి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. మనం నిశ్శబ్దంగా వుంటే ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాలు ఇచ్చే వారు అటువంటి పనులు మానుకోవాలని సూచించారు.