ఖమ్మం జిల్లలో కలకలం సృష్టించిన గుప్తనిధుల తవ్వకం, క్షుద్రపూజల కేసులో అదృశ్యమైన రాజశ్రీ విషయం ఇంకా ఏమీ తేలలేదు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో వెల్లంకి రాజశ్రీ (16) అదృశ్యం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

రాజశ్రీ సమీప బంధువైన గద్దె నర్సింహారావు తన ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయనే అనుమానంతో 30 అడుగుల లోతు గొయ్యి తవ్వించి క్షుద్ర పూజలు చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే స్థానిక పూజారులు మాత్రం తాము హోమాలే చేశామని, క్షుద్ర పూజల సంగతి తెలియదని చెబుతున్నారు. 

కాగా, ఈ పూజల్లో కీలకంగా భావిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన మరో పూజారి ప్రకాశ్‌ శర్మ వెంటే రాజశ్రీ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయన భార్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఆశ్రమాన్ని నిర్వహిస్తుండడంతో అక్కడికే ఆ బాలికను తీసుకెళ్లి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మొబైల్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేస్తున్నప్పటికీ ప్రకాశ్‌ శర్మ, రాజశ్రీ ఎక్కడున్నారనే సమాచారాన్ని పోలీసులు కనుగొనలేకపోతున్నారు. ఈ విషయమై ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ను వివరణ కోరగా కేసులో కీలకమైన పూజారి ప్రకాశ్‌ శర్మ, రాజశ్రీ ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు.