Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలివే...

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

Key decisions taken by Chandrababu Cabinet GVR
Author
First Published Jun 24, 2024, 2:43 PM IST | Last Updated Jun 24, 2024, 2:46 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చింది. ప్రధానంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్ హామీల్లోని ఆరు గ్యారంటీలపై చర్చ జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుకు సంబంధించి సంతకాలు చేశారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం సామాజిక పింఛన్ రూ.4వేలకు పెంపు ఫైల్‌పై చేశారు. అలాగే, స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడంతో పాటు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపైనా చంద్రబాబు  సంతకాలు చేశారు. ఆ తర్వాత 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు.

కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అంశాలివే...
ప్రధానంగా సీఎం చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు అమలుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ ద్వారా 16వేల 347 టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పెంచిన రూ.4వేల పింఛను పంపిణీ, జులై 1 నుంచి ఇంటి వద్దే పింఛన్ల అందజేత, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 

కాగా, మెగా డీఎస్సీ ప్రక్రియ జులై ఒకటి నుంచి ప్రారంభం కానుండగా... డిసెంబర్‌ 10వ తేదీలోపు 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 

గత ప్రభుత్వం ఇప్పటివరకు నెలకు రూ.3వేలు పింఛను పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారం వేళ చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పింఛనును ఒకేసారి రూ.4వేలకు పెంచుతామని ప్రకటించారు. అది కూడా ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛను అందిస్తామని తెలిపారు. అన్నట్లుగా కేబినెట్‌ మీటింగ్‌లో ఈ హామీకి ఆమోదం తెలిపారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రూ.వెయ్యితో కలిపి.. 65 లక్షల మంది పింఛనుదారులకు వచ్చే నెలలో రూ.7వేల చొప్పున పింఛను అందనుంది. ఆ తర్వాత ఆగస్టు నుంచి రూ.4వేల పింఛను అందుకుంటారు.

అలాగే, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును జగన్ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చింది. ఆ పేరును తిరిగి ఎన్టీఆర హెల్త్ వర్సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పలు కీలక అంశాలపై చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గంలో చర్చించి ఆమోద ముద్ర వేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios