టీడీపీ ఎంపీ కేశినేని నాని... బీజేపీలో చేరనున్నారా..? గత కొద్ది రోజులుగా ఇదే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  కాగా.... ఆయన బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని... ఈ కారణంతోనే ఆయన ఇటీవల నితిన్ గడ్కరీని కలిశారంటూ ప్రచారం ఊపందుకుంది.

ఆ ప్రచారం నిజమనిపించేలా... తాజాగా కేశినేని నాని తనకు ఇస్తానన్న విప్ పదవిని తిరస్కరించారు. దీంతో... ఆయన బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని అందుకే... విప్ పదవిని తిరస్కరించారనే ప్రచారం జరుగుతోంది. కాగా...దీనిపై కేశినేని నాని స్పందించారు.

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. ఇక విప్ బాధ్యతలు అప్పగించడంపై స్పందిస్తూ.. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కానీ ఆ పదవిని తాను స్వీకరించలేనని, తాను అంత సమర్థుడిని కాదని కేశినేని నాని చెప్పుకొచ్చారు.