హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేఖర రావు ప్రచారం చేయడం దాదాపుగా ఖరారైంది. ప్రత్యక్షంగానే ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎపిలో ప్రచారం చేసే అవకాశాలున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి వ్యాఖ్యలు ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇతర జాతీయ నేతలతో పాటు కేసీఆర్ ఎపిలో వేదికను పంచుకుంటారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను కూడా ఆయన స్వాగతించారు. అంతేకాకుండా కేసీఆర్ తో జగన్ వేదికను వంచుకుంటారని కూడా ఆయన చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భేటీ అయిన తర్వాత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా పావులు కదపడానికి కూడా కేసీఆర్ సిద్ధపడినట్లు అర్థమవుతోంది.

కేసీఆర్ ఎపికి వెళ్లి జగన్ ను కలుస్తారని కేటీఆర్ చెప్పడమే కాకుండా ఎపిలో ఇతర నాయకులతో కూడా ఆయన చర్చలు జరుపుతారని అన్నారు. చంద్రబాబు వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది. 

ప్రత్యేక హోదాకు తాము మద్దతు ఇస్తున్నామని చెప్పడం ద్వారా ఎపి ప్రజలను టీఆర్ఎస్ సానుకూలం చేసుకునే ఎత్తుగడను అనుసరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. 

అయితే, కేసీఆర్ కు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని ఇప్పటికే టీడీపి నాయకులు ప్రారంభించారు. ఎపికి అన్యాయం చేసినవారితో జగన్ చేతులు కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కేసులు వేసిందని ఎపి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తెలంగాణ ఎపికి విద్యుత్తు బకాయిలు పడిందని చెబుతూ ఆ బకాయిలను చెల్లించాలని జగన్ అడగగలరా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ అటువంటి కేసీఆర్ తో జగన్ దోస్తీ కట్టి రాష్ట్రానికి అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారని టీడీపీ చెప్పడానికి సిద్ధపడింది. మొత్తం మీద, కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టడం ద్వారా వివాదాలకు తెర తీసేట్లే కనిపిస్తున్నారు.