వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేతలు వలస వెళ్లడం వెనుక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తం ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలతో జగన్‌కు దిక్కు తోచడం లేదన్నారు. కేసీఆర్ సాయంతో టీడీపీ నేతలను జగన్ వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని వైసీపీలో చేరమని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇంకా ఒకరిద్దరు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్లను చంద్రబాబు ప్రస్తావించారు.

జవాన్లకు అండగా నిలుస్తాం కానీ, రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెట్టమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్వార్ధం కోసం ఏం చేయడానికైనా ప్రధాని సిద్ధమేనని ఆరోపించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోడీ వ్యవహరిస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు.