ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు కావూరు సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. అయితే, ఆయన బిజెపిలో అంత చురుగ్గా వ్యవహరించడం లేదు. తిరిగి రాజకీయాల్లో ఆయన యాక్టివ్ కావాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

ఏలూరు స్థానం నుంచి ఆయన రెండుసార్లు ఆయన లోకసభకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి ఆయన ఏలూరు స్థానం నుంచి లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పోటీ చేసిన తోట చంద్రశేఖర్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. దీంతో కావూరుకు ఏలూరు టికెట్ ఇచ్చేందుకు జగన్ కు ఏ విధమైన అభ్యంతరాలు ఉండకపోవచ్చునని అంటున్నారు. కావూరు సాంబశివ రావు వైసిపిలో చేరితే సామాజిక వర్గాల కూర్పులో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.