హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబును ప్రజలు పక్కన పెట్టేశారని స్పష్టం చేశారు ఫిలింక్రిటిక్ కత్తి మహేశ్. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పూర్తి స్థాయిలో చెయ్యలేదని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఫలితంగా చంద్రబాబుకు ఓటెయ్యలేదన్నారు. 

ఓ చానెల్ తో మీడియాతో మాట్లాడిన కత్తి మహేశ్ మహిళల ఓట్లను ఆకర్షించేందుకు పసుపు-కుంకుమ పథకాన్ని తెరపైకి తెచ్చారన్నారు. పసుపు-కుంకుమ వల్ల 10 నుంచి 15 శాతం ఓటింగ్ టీడీపీకి పెరిగే అవకాశం ఉందే తప్ప 90శాతం ఓట్లు పడే అవకాశం లేదన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వీర అభిమానుల్లో మహిళలు సైతం ఉన్నారని తెలిపారు. ఇకపోతే జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకే నష్టమని వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. పవన్ కళ్యాణ్ నిత్యం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను టార్గెట్ చెయ్యడం, చంద్రబాబును పన్నెత్తిమాట అనకపోవడంతో ప్రజలు వేరుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. 

పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు అయ్యారంటూ ప్రచారం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో గానీ, నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చెయ్యలేదని దాని వెనుక కుమ్మక్కు రాజకీయాలే కారణమని ప్రజలు భావించారని ఆరోపించారు. 

అటు చంద్రబాబు గానీ లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చెయ్యకపోవడం ఇదంతా రాజకీయ ఎత్తుగడ అని ప్రజలు భావించారని తెలిపారు.