అమరావతి: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారు. ఆయన శనివారం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని నేతలతో సమావేశమయ్యారు. 

ఆ సమావేశంలో పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపి అభ్యర్థిగా సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు మల్యాద్రి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చీరాల శాసనసభ నియోజకవర్గం నుంచి కరణం బలరాం పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఆమంచి పార్టీ మారడంతో కరణం బలరాం అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. అద్దంకి నుంచి గొట్టిపాటి రవి, బాపట్ల నుంచి అన్నం సతీష్, పరుచూరు నుంచి ఏలూరు సాంబశివ రావు, సంతనూతలరాడు నుంచి విజయకుమార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. రేపల్లె నుంచి సత్యప్రసాద్ ను చంద్రబాబు రంగంలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.