ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనే అని బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కానీ సార్వత్రిక ఎన్నికలు కోసమే ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఏపి ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. విభజన చట్టం కాంగ్రెస్ హయాంలోనే రూపొందిందని అప్పుడు ప్రత్యేక హోదాని ఆ చట్టంలో ఎందుకు పొందుపర్చలేదని ఆయన కాంగ్రెస్ ను ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో కేవలం ఏపికి ప్రత్యేక హోదా గురించి పరిశీలించాలని మాత్రమే వుందన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది వుంటూ ఖచ్చితంగా హోదా ఇవ్వాల్సిందే అని చట్టంలో పెట్టేవారన్నారు. అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా వున్న వీరప్ప మొయిలీ అడ్డుకోవడం వల్లే హోదా అంశాన్ని చట్టంలో చేర్చలేదని     ఆరోపించారు. 

ఇపుడు చంద్రబాబుతో కుమ్మకైన కాంగ్రెస్ రాహుల్ చేత ప్రత్యేక హోదాపై మాట్లాడించారని అన్నారు. మరోసారి వీరి చేతిలో మోసపోడానికి ఏపి ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. ఈసారి వీరి ఆటలు సాగవని లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

కేంద్ర ప్రభుతం ఏపికి చేసిన సాయాన్ని దాచిపెట్టి...అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇలా జిత్తులమారి నక్కలా  వ్యవహరిస్తున్న చంద్రబాబును అసలు స్వరూపాన్ని బయటపెడతామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు కేంద్రం ఏపికి ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు ను రాష్ట్ర ప్రజలు మరికొన్ని రోజుల్లోనే తరిమికొట్టడం ఖాయమని లక్ష్మీనారాయణ వెల్లడించారు.