అక్రమ కట్టడాల నిర్మూలనలో భాగంగా ... ప్రజా వేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆలస్యంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతానికి జగన్ బాగానే పని చేస్తున్నాడని.. అయితే ప్రజా వేదికను కూల్చడం కన్నా.. ఏదైనా ఆస్పత్రిగా మార్చుంటే బాగుండేదన్నారు. రూ.8 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనమని.. ప్రజాధనాన్ని నీళ్లలో పోశారన్నారు. గురువారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఆయన.. టీడీపీ లేకుండా చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు, లోకేశ్ పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

అలా చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఎవరి ఇష్టంతో వాళ్లు బీజేపీలో చేరుతున్నారన్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని.. ఎవరూ చట్టానికి అడ్డురారని అన్నారు.