చిత్తూరు: చిత్తూరు జిల్లా కాణిపాకం  వరసిద్ది వినాయకస్వామి ఆలయాన్ని  అధికారులు మూసివేశారు. ఈ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న హొంగార్డుకు కరోనా సోకింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు.

చిత్తూరు జిల్లాలోని పలు ఆలయాల్లో పనిచేస్తున్నవారికి కరోనా సోకుతోంది. తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్ కు కరోనా సోకడంతో ఆలయాన్ని రెండు రోజుల పాటు మూసివేశారు. ఈ నెల 14వ తేదీ నుండి ఆలయాన్ని తెరిచారు.

also read:ఏపీలో ఆరు వేలు దాటిన కరోనా కేసులు: ఒక్క రోజులో 294 మందికి పాజిటివ్, ఇద్దరి మృతి

ఇదే జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే ప్రధాన అర్చకుడికి కరోనా సోకింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఈ నెల 10వ తేదీ నుండి ఈ ఆలయం తెరవాలని భావించారు. అయితే అదే సమయంలో ఆలయంలో పనిచేసే ప్రధాన అర్చకుడికి కరోనా సోకడంతో ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.

తాజాగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయంలో కూడ కరోనా కలకలం రేపుతోంది. ఈ ఆలయం వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న  హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఈ ఆలయాన్ని మూసివేశారు.

ఈ నెల 11వ తేదీ నుండి  భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం కల్పించారు. ఇతర ప్రాంతాల నుండి భక్తులు బాలాజీని దర్శించుకొనేందుకు వస్తున్నారు. దీంతో భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ప్రతి రోజూ పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు 6,152కి చేరుకొన్నాయి. చంద్రబాబు నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కి కూడ కరోనా సోకింది.రాష్ట్రంలో కరోనా ఉధృతిని తగ్గించేందుకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.