Asianet News TeluguAsianet News Telugu

వై నాట్ జగన్! ఇద్దరి మధ్య హైదరాబాద్..

ఏపీ రాజకీయం హీటెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలూ పోరాడుతున్నాయి. ఈ తరుణంలో ఏపీలో అధికార పగ్గాలు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? అనేది చర్చనీయంగా మారింది.

Kandukuri Ramesh Babu facebook stories on Andhra Pradesh politics KRJ
Author
First Published May 10, 2024, 9:29 AM IST

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హీటెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలూ పోరాడుతున్నాయి. అయితే మునుపెన్నడూ లేని రీతిలో ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? అధికార పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు? అనేది చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు తమ తమ అంచనాలు, అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు. తాజాగా కందుకూరి రమేష్ బాబు ఫేస్ బుక్ కథనం వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో స్థిరపడిన కమ్మ వర్గీయులు చేస్తున్న ప్రచారం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలుపు అనుమానమే అనే భావన బలపడుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనీ, మెజారిటీ ప్రజలు జగన్ కు మద్దతు పలుకుతున్నారని,  మన హైదరాబాద్ మీదుగా 'ఆంధ్రప్రదేశ్' విశ్లేషణ అందుకే. అంటూ.. తన అభిప్రాయాలు వెల్లబుచ్చారు. 
 
కందుకూరి రమేష్ బాబుఫేస్ బుక్ సోర్టీ యథాతథంగా ఇప్పుడు చూద్దాం,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ సారి శాసన సభ ఎన్నికల్లో ఎటు చూసినా గెలుపు బడుగు బలహీన వర్గాలదే అని చెప్పాలి. అవును. జగన్ మాటల్లో చెప్పాలంటే ‘పెత్తందార్లు’ ఈసడించుకునే ‘బీదవాళ్ళు’, ‘సోమరి పోతులు’ అయిన ఆ బడుగు బలహీన వర్గాలే  తిరిగి అధికంగా లాభపడే అవకాశం ఉందని చెప్పాలి. అందుకు కారణం జగన్ గెలిస్తే ఎప్పట్లా ఉచితలు, సంక్షేమ పథకాలు వారికి యధాతధంగా అందుతాయి. గెలువక పోయినా అంతకన్నా రెట్టింపు హామీ ఇచ్చిన చంద్రబాబు వాటిని ఎలాగోలా అమలు చేయక తప్పదు. కాబట్టి ఆంద్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారూ అన్న ప్రశ్నకు 'తిరకాసు సమాధానం'తో ఇప్పటిదాకా జగన్ ‘నమ్ముకున్న వర్గాలే’ అని చెప్పక తప్పదు. రేపు బాబు అధికారం చేపట్టినా కూడా. ఐతే, వారి మనోభావాలు ప్రసార ప్రచార సాధనాలకు అంత ముఖ్యం కాదు కనుకే అసలు పరిస్థితి బయటకు వెల్లడయ్యే అవకాశం లేదనే చెప్పాలి.  

ఐతే.. సూటిగా చెప్పాలంటే జగన్ కనీసం వంద శాసన సభా స్థానాలకు పైగా గెలిచి తప్పనిసరిగా అధికారం చెప్పట్టడం ఖాయం అన్న భావన మమూలు ప్రజల నుంచి వినవస్తుంటే డబ్బు- దర్పం, చదువు సంధ్యా, ఉద్యోగాలు – రాజకీయ అధికారం ఉన్న వాళ్ళతో మాట్లాడితే; 'వాళ్ళు'- అంటే - వ్యాపార విలువలే ప్రధానంగా గల ‘కమ్మకులం’ వర్గీయులు అని భావించవచ్చు; వారు తప్పకుండా బాబు గెలుస్తారని చెబుతున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే “అభివృద్ధి’ గెలుస్తుంది. ఐతే, 'పైన చెప్పిన' కమ్మ కులస్తులంతా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవాళ్ళని గుర్తించాలి. తెలంగాణకు వచ్చి ఇక్కడి సమస్త వనరులపై , రియల్ ఎస్టేట్ తో సహా స్వచ్ఛంద సామాజిక సేవరంగాలతో సహా ఆధిపత్యం వహిస్తోన్న అల్ప సంఖ్యాకక జనం వారనే భావించాలి. మిగతా వారు జగన్ గెలుస్తారనే చెబుతున్నారు. 

ఈ సంపన్న వర్గం కాకుండా హైదరాబాద్ లో బతుకు దెరువు కోసం వచ్చిన వాళ్ళు, వాచ్ మెన్లుగా, ఇండ్లలో పని మనుషులుగా ఇతరత్రా చిరు వ్యాపారులుగా బ్రతుకుతున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఆశ్చర్య పోయే విషయం వినవచ్చింది. 'అక్కడ ఎవరు గెలుస్తారూ?' అంటే 'బాబు' అనే విస్పష్టంగా చెబుతున్నారు. వారంతా పదకొండో తేదీన బాబు మనుషులు పెట్టిన బస్సుల్లో ఆంధ్రాకు ఓటింగ్ కు వెళుతున్నారు. పన్నెండో తేదీన జగన్ పెట్టిన బస్సుల్లో వెళుతున్న వాళ్ళు తక్కువే అని తెలిసింది. ఆంధ్రలోని మూడు జిల్లాలపై ప్రభావం చూపే వీరి సంఖ్య పద్నాలుగు లక్షలు ఉంటారని ఒక అంచనా. అందులో ఆరు లక్షల మంది వరకైనా తమ స్వగ్రామాలకు వెళ్తారనే అభిప్రాయం ఉంది. కాగా, బాబు బస్సుల్లో వెళుతున్న వాళ్ళంతా జగన్ బీదవాళ్ళకు బెనిఫిట్ చేస్తున్నాడని తీవ్ర అసహనంతో అనడం గమనార్హం.

"మీరు బీదవాళ్లు కాదా?" అంటే "కాద"నే అంటున్నారు. "మేం హైదరాబాద్ కు వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకున్నాం" అంటున్నారు. "అక్కడున్న వాళ్ళు తెలివి హీనులు. బుద్ది మాంధ్యులు. తాగుబోతులు, చదువు సంధ్య లేనివాళ్లు, ఉచితాలకు అమ్ముడు పోయిన వాళ్ళు" అనే అర్థంలో నిందిస్తున్నారు. "అటువంటి వాళ్ళకు మాకు పోలికా?" అని కూడా అంటున్నారు. గమ్మత్తు ఏమిటంటే వీరంతా ఈ సారి బాబునే ముఖ్యమంత్రిగా చూడాలను కోవడం ఒక్కటే కాదు, 'జగన్ ని ఓడిస్తున్నాం' అని కూడా అంటున్నారు. 
 
అట్లా ‘హైదరాబాద్ కేంద్రం‘ అన్నది ఈ సారి బాబు కేంద్రంగా  ఉన్న ఓటర్ల శిబిరం అనే చెప్పాలి. అటు కమ్మ మొదలు ఇతర అగ్ర కులస్తులు.ఇటు చిరు పనుల మీద ఆధార పడి వలస వచ్చిన వాళ్ళు, వీరిద్దరూ జగన్ ఓటమి కోసం గట్టి తాపత్రయంతో ఉన్నారు. వీరికి అక్కడే స్థిరంగా ఉన్నవాళ్ళు 'చేతగాని వాళ్ళు'. చిత్రమేమిటంటే ఈ చేతగాని వాళ్ళే అధిక సంఖ్యాకులు. వాళ్ళే ఈ సారి ఎన్నికలను నిర్ణయిస్తారు. కాగా, ఎలాగైనా బాబు కేంద్రంగా పాజిటివిటిని మీడియా ప్రభలంగా ప్రాచుర్యం చేసే పనిలో వీళ్ళకు తోడుగా హైదరాబాద్ లో స్థిరపడిన సంపన్న ఆంధ్రులు నిమగ్నమైనారు. 

ఎన్నికల్లో బాబుకు అనుకూలంగా మరింత ప్రబలంగా ప్రాపగాండా చేస్తున్నది వీళ్ళే. తమ చేతుల్లో ఉన్న సినిమా, మీడియా, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపార కేంద్రాలపై గుత్తాధిపత్యం వహిస్తున్న ఈ కమ్మ కులస్తులంతా చంద్రబాబు గెలుపు కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. తమకు ఇవే చివరి ఎన్నికలు అన్నంత సీరియస్ గా తీసుకోవడానికి కూడా వీరికి కారణం ఉంది. ఈ సారి జగన్ గనుక గెలుస్తే ఇక శాశ్వతంగా వారు అటు ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ శ్రేణి పౌరులే అవుతారు. మానసికంగా ఇష్టం లేకపోయినా ఇకముందు వారు ఇటు తెలంగాణాలో స్థిరపడక తప్పదు. చివరకు ఆంధ్రలో ఉన్న ఆస్తులు కూడా వదిలేసి ఇక్కడి పౌరులుగా ఉండక తప్పని పరిస్థితి. 

అందువల్లే చివరి బాంధవ్యం కాపాడుకోవడానికా అన్నట్టుగా కొందరు నిర్మాతలు సినిమాలు తీయడం కూడా పక్కన పెట్టి ఆ డబ్బులతో ఆంధ్రాలో చంద్రబాబు గెలవడానికి శక్తి మేరా కృషి చేస్తున్నారు. కొందరు పెద్ద ఎత్తున ఆంధ్రాలోని ముఖ్య పట్టణాల్లో దొరికిన కాడికి భూములు కొని పెట్టారు. గెలుస్తే ధరలు త్రిబుల్ అవుతాయి. ఓడిపోతే పోనీ. పర్లేదు ఒక భాగం పోతే పోనీ అన్న చందంగా వీరు ఇటీవల కొన్ని  నెలలుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. వీలైనన్ని విధాలా తమ సామాజిక వర్గం ఎలాగైనా అధికారంలోకి రావడానికి ఆఖరి పోరాటంగా భావించి చెమటోడుస్తున్నారు. ఆంధ్రా సీనియర్ జర్నలిస్టులతో వివిధ యూ ట్యూబ్ చానల్లతో కావల్సినంత అభిప్రాయ సరళిని మార్చే పనిలో నిమగ్నమయ్యారు.  

వీటన్నిటికి నిమిత్తంగా పేదజనం ఎక్కడికక్కడ ఎటువంటి తీర్పు చెప్పాలో నిర్ణయం తీసుకునే ఉన్నారు. ముందే చెప్పినట్టు వారికి పోయేదేమీ లేదు. తెలంగాణా ఉద్యమ పుణ్యాన ఒక సోషల్ ఇంజనీరింగ్ మొదలైంది. తెలంగాణా స్వరాష్ట్రంగా మారి తన ప్రయోగాలు తాను చేసుకుంటోంది. ఇక్కడ కావల్సినంత చైతన్యమూ ఉన్నది. భిన్న రాజకీయ చేతనా అధికం. కానీ ఆంధ్రాలో ప్రజలు కేంద్రంగా ఆలోచించే, ఆచరణలోకి తెచ్చే పురోగామి శక్తుల కొరత ఉన్నది. కొన్ని దశాబ్దాలుగా కనీస జీవితాలు గడపడం తెలియని నిస్సహాయ ప్రజలు కొంతలో కొంత రాష్ట్ర విభజన అనంతరం లబ్ది పొందారు. మెల్లగా వారి జీవితాలు కేంద్రంగా కొంత జరుగుబాటు రాజకీయాలు మొదలయ్యాయి. తన అధికారం కోసమైనా జగన్ కమ్మ కుల ఆధిపత్యం నిరసిస్తూ అనివార్యంగా వీరి బ్రతుకుల ఆధారంగా పాలనకు నడుం కట్టారు. 

ఆ ప్రాసెస్ ఒకటి అనివార్యంగా ముందుకే పోతుంది గానీ వెనక్కు పోదు. ఆ లెక్కనా తెలంగాణా ఉద్యమం ఆంధ్ర బక్క జీవికి ఉడుతా భక్తిగా లాభం చేకూర్చడం గత ఎన్నికల నుంచి వేగవంతమైంది. అది ఈ ఎన్నికల అనంతరం మరింత ముందుకే పోతుంది గానీ జరిగే నష్టం లేదు. సరిగ్గా ఈ సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వలస వాదులకు సామాన్యుల కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యం గనుక అభివృద్ధి నినాదాన్ని పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో ముందుకు తెస్తున్నారు. నిజానికి మొన్నటి శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ ఆశ పెట్టుకున్న 'అభివృద్ధి' కూడా ఇలాంటిదే. అది వీగిపోవడం మనం కళ్లారా చూశాం. ఇప్పుడు ఆంధ్ర వంతు వచ్చింది మళ్ళీ. 

ఐతే, విశేషం ఏమిటంటే.. కమ్మ కులం ఆధిపత్యాన్ని కూకటి వేళ్ళతో పెకలించుకుంటూ వస్తోన్న జగన్ రెడ్డి ఈ సారి శాసన సభ ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టి ఈ  అల్ప సామాజిక వర్గం ఆశలపై శాశ్వతంగా నీళ్ళు చల్లే పరిస్థితే కనిపిస్తోంది. అందుకు ఆయన గత ఐదేళ్లు గా  నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న దళితుల నుంచి కాపు సామాజిక వర్గం దాకా బలమైన పునాది వేసుకుంటూ రావడం కలిసి వస్తోంది. వారికోసం అన్ని వ్యవస్థల్లో తగినన్ని రిజర్వేషన్లు ఇచ్చి స్థిరపర్చడమే కాక కమ్మ రాజ్యాన్ని ఎదుర్కోవడమే తన ఎజెండా అని చెప్పకనే చెబుతున్నారు. ఆ దిశలో పనిచేస్తూ బలంగా పేదవాళ్ళ ఇండ్లలో గుడి కట్టుకునేంతగా సంక్షేమాన్ని తీసుకెళ్ళారు. అందులో విజయం సాధించారు. ఈ సారి గెలుపు అన్నది అతడికి ఏమంత కష్టం కూడా కాదు. అందుకే ‘వై నాట్ 175’ అన్న నినాదం కూడా ఇచ్చారు. ఓడిపోతే ఆయనకు వచ్చే  నష్టం  కూడా ఏమీ లేదు. ఒక్కడుగా ఓడిపోతాడు. జైలు జీవితం మొదలు ఆయన చూడనిది లేదు కూడా.  
ఇక్కడే మరో విషయం చెప్పాలి. 

 మొన్నటి ఎన్నికల్లో తెలంగాణాలో రాజకీయంగా వెలుమ కులం ఆధిపత్యాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని  రేవంత్ రెడ్డి బలంగా దెబ్బతీసి అధికారం చేపట్టగా ఇప్పుడు రెండోసారి కమ్మ కులం బలహీన ఆశలపై జగన్ రెడ్డి మరోసారి శాశ్వతంగా బొగ్గుల కుంపటి పెట్టి వారిని మెసలకుండా చేసే అవకాశమే ఉంది. ఈ సారి జగన్ గెలిస్తే కెసిఆర్ దెబ్బకు కూలిపోయి కుంటుతున్న 'తెలుగుదేశం' పూర్తిగా నిస్తేజమవుతుంది. ఇక లేచి నిలబడటం సుదూర భవిష్యత్తులో అసాధ్యం. 

ఈ ఎన్నికల మరో చిత్రం ఏమిటంటే, ఈ సారి ఆంధ్రప్రదేశ్  రాజధాని అంశం గానీ, రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ నినాదం గానీ పెద్ద విషయాలు కాకపోవడం మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు ఉన్న చర్చ అంతా అభివృద్ధి వర్సెస్ సంక్షేమమే. ఐతే, అభివృద్ధి అంశాన్ని ప్రాచుర్యంలో పెడుతున్నది ముఖ్యంగా కమ్మ వర్గం ఒక్కటే కావడంతో ముందే చెప్పినట్టు జగన్ ‘సంక్షేమం’ అతడిని గెలిపించదేమో అన్న భావన వివిధ మీడియాల ద్వార మనకు చేరుతున్నది. కానీ నిశ్శబ్దంగాని జన సామాన్యం చెప్పే తీర్పు  మాత్రమే ఆఖరికి శిరోధార్యం. మొదటే పేర్కొన్నట్టు అది ఒక రకంగా జగన్ గెలుపు కోరుకుంటోంది. ఒకవేళ కూటమి ఎలాగోలా పై చేయి సాధించినా తమకు మాత్రం వచ్చే నష్టం పెద్దగా లేదని కూడా చెప్పక తప్పదు. 

వాస్తవానికి 'అభివృద్ధి' అన్నది ఒక నెపం. సినిమా, మీడియా, ఇతర వ్యాపార వర్గాలన్నీ ప్రధానంగా కమ్మ కులస్తుల చేతుల్లో ఉన్న కారణంగా ఇప్పటికీ వైఎస్ జగన్ పాలనలోని ‘సంక్షేమం’ మటుకే వెలుగులోకి వచ్చింది. ‘అభివృద్ధి’ అన్నది చంద్రబాబు వల్లే సాధ్యమనే వాదన తిరిగి వారు చాకచక్యంగా ముందుకు తెస్తున్నారు. ఐతే, మరో రకంగా ‘పేదల ఇండ్లలో అభివృద్ధి’ పేరిట జగన్ చాలా చురుగ్గా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు, నగదు బదిలీల వల్ల ఆప్తుడే అయ్యాడు. సగటున ఒక బీద కుటుంబం లక్షన్నర దాకా నగదు రూపేనా చేతుల్లోకి తీసుకుంది అంటే అది వారికి చిన్న విషయం కాదు.  దానికి తోడు వారికి విద్య, వైద్యం, పౌర సేవలను అందుబాటులోకి తెచ్చి ఆయా వర్గాలకు అమిత అభిమాన పాత్రుడయ్యాడు. రేపటి ఎన్నికల్లో ఈ బడుగు బలహీన వర్గాలే ఆయన్ని కాపాడే ఓటర్లు, దేవుళ్లు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన దేవుడిని, ఓటరును ఇద్దరినీ నమ్ముకుంటూ ఉన్నానని చెబుతూనే ఉన్నాడు. షర్మిలా, అవినాష్ ఇష్యూలు కూడా ఆయనకు సానుభూతినే తెచ్చేలా ఉన్నాయి. కానీ అవి సంకట పరిచేలా లేవని కూడా క్షేత్రస్థాయి మిత్రులు చెబుతున్నారు. 

ఇక్కడ మరో విషయమూ పేర్కొనాలి. కమ్మల ప్రతినిధి ఐనా చంద్రబాబు నాయుడు ఒంటరిగా జగన్ ను ఓడించలేని కారణంగా కాపు వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తో కలిసి ఉమ్మడిగా పోటీకి దిగినప్పటికీ జగన్ వ్యూహాత్మకంగా అటు ముద్రగడను తన వైపుకు తిప్పుకోవడమే కాకా తెలుగుదేశం, జనసేన కన్నా ఎక్కువ కాపు వర్గానికి సీట్లు అధికంగా ఇచ్చి వారి మద్దతు కూడగట్టడం చెప్పుకోదగిన అంశం. మరోవంక చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ఎందుకైనా మంచిదని బిజెపితో కలిసి ఉమ్మడి కూటమి ఏర్పాటు చేయడంతో అప్పటిదాకా ఆ ఇరువురి (తెలుగుదేశం-బిజెపి ) కలిసి కట్టు పోరాటంపై ఆదరణ ఉన్న వర్గాలు సైతం వారు బిజెపితో జత కట్టడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా ఉమ్మడి కూటమి ఆచరణలో ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా బెడిసి కొట్టే ప్రమాదమే ఉన్నది.  

మరో ముఖ్య విషయం.. మొదటి నుంచి వాలంటరీ వ్యవస్థను వివిధ కారణాలతో నిందిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ , బాబులు ఆఖరి కి వారిని గుర్తిస్తూ  సాలరీ పది వేలకు పెంచుతామని చెప్పడం కూడా నెగిటివ్ అయ్యే పరిణామమే. అంతేకాదు, చంద్రబాబు కేవలం అభివృద్ధికి ప్రతీక ఐతే, జగన్ సంక్షేమానికి ప్రతినిధులు అనుకుందాం కాసేపు. కానీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసేటప్పటికి జగన్ కన్నా రెట్టింపు ఉచితాలు, నగదు బదిలీలతో బాబు ‘ఉమ్మడి మ్యానిఫెస్టో’ ముందుకు రావడం ఆ పార్టీలకు అసలుకే ముప్పు కాబోతున్నది. వాస్తవానికి 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని విషయం ఒకటి, తాజాగా ఇప్పటిదాకా వ్యతిరేకించిన విధానాలనే తాము స్వీకరించడంతో అది వారి ఘనతగా కన్నా నిస్సహాయతగా లేదా బలహీనతగా ప్రజలు భావిస్తున్నారు. అప్పుల ఊబిలోకి దిమ్పుతున్నాడనే వాదన పెద్ద ఎత్తున ముందుకు తెచ్చిన బాబు తిరిగి అదే మూసలోకి వెళ్లి జగన్ ను కాపీ కొట్టిన కారణంగా భంగపడే అవకాశమే ఉందన్న భావన కూడా బాహాటంగా వ్యక్తమవుతోంది. మొత్తంగా ఇది మరొక మైనస్ గానే కాక కూటమికి శాపంగా పరిణమిస్తోంది.

ఇవన్నీ పేర్కొనడం ఎందుకూ అంటే భిన్నమైన కోణం కూడా ఉన్నదని చెప్పడానికే. ఆంధ్ర రాజకీయాలు మనం బయట అనుకున్నట్టుగా బాబుకు సానుకూలంగా ఉన్నవనుకోలేమని గుర్తు చేయడానికే. ఐతే, ఈ అభిప్రాయాలన్నీ మాజీ టివి 9 లేదా తాజా RTV రవి ప్రకాష్ మాదిరిగా ‘స్టడీ’ చేసి రాస్తున్నవి కాదు. ఆంధ్రప్రదేశ్ పరిణామాలను కామన్ సెన్స్ తో చూసి చెబుతున్నవే.  అక్కడున్న మిత్రులతో మాట్లాడి తెలుసుకుని తెలుపుతున్నవే. ఒక ఫలితంగా రేపు రేపు అసలు ముఖచిత్రం ఎలాగైనా వ్యక్తం కావొచ్చుగాక. కానీ ఒక ప్రమాదమైతే పొంచి ఉన్నది. రానున్న రోజుల్లో ఆంధ్రా వాళ్ళు హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలోకి చొచ్చుకు పోతారు. జగన్ గెలిస్తే హైదరాబాద్ లోని సంపన్న ఆంధ్రులు తమ ప్రాంతంపై ఆశలు వదులుకుని  శాశ్వతంగా తెలంగాణాలో వేళ్లూనుకునే ప్రమాదం ఎక్కువ. బాబు గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సహకారంతో మళ్ళీ ఆంధ్ర వ్యాపారులు, రాజకీయ నాయకులు మరింత చెలరేగే ప్రమాదమూ ఉన్నది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉక్కరి బిక్కిరి అవుతున్న అవకాశవాద ఆంధ్ర వ్యాపార రాజకీయ వర్గాల పీడ మనం భరించక తప్పదు. మరింత జాగురూకతతో ఎదుర్కోవాలి. తెలంగాణా సమీప సవాళ్లలో ఇదొకటి. 


ఈ అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. link below 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios