జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించనున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ వారాహి బస్సు ప్రారంభ కార్యక్రమంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు అనుకున్న విధంగా కాకుండా విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి  ప్రారంభించనున్నారు.

జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించనున్నారు. అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభ స్థలిని ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యింది.

సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం, మరుగుదొడ్లు కూడా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం సభా ప్రాంగణాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

వాలంటీర్లకు సూచనలు

సభా వేదిక పరిశీలన అనంతరం అక్కడే ఉన్న ఆవిర్భావ సభ వాలంటీర్లతో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు వాలంటీర్ల సేవలు చాలా కీలకం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాలంటీర్లు పనిచేయాలి. నిబంధనల ప్రకారం పక్కాగా వ్యవహరించండి. సభకు వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించి, వారిని ప్రత్యేకంగా చూసుకోవడం వాలంటీర్ల బాధ్యత. పార్టీ ప్రతిష్ట పెంచేలా వాలంటీర్లు సేవలు ఉండాలి. పూర్తిస్థాయి లో సమన్వయం చేసుకొని పని చేయండి. కార్యక్రమాల నిర్వహణ కమిటీ సూచనలు తీసుకోండి. పోలీసు శాఖకు సహకరించి, సభ సజావుగా సాగేలా చూడాలని పేర్కొన్నారు.

వారాహి ఆగదు... పోలీసులకు మా సహకారం

అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం ఉండటం వల్ల పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు వారాహి యాత్రను ముందు అనుకున్నట్లు కాకుండా స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్నట్టు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాకుండా.. శాసనసభకు వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ..మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో మచిలీపట్నానికి బయలుదేరి వెళ్తారు. పోలీసులు చేసిన విజ్ఞప్తికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ముందుగా ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదనీ. నిర్దేశించిన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు జనసైనికులు సిద్దంగా ఉండాలని సూచించారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ క్రమశిక్షణ పాటించాలనీ, వారాహి వాహనానికి ఏమాత్రం అడ్డు రాకుండా సభాస్థలికి ఎంతో జాగ్రత్తగా తీసుకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ మచిలీపట్నానికి బయలుదేరి వెళ్తారని అన్నారు.