Asianet News TeluguAsianet News Telugu

ఆ బాలింత మృతికి వైద్యశాఖ మంత్రే బాధ్యత వహించాలి: కళా వెంకట్రావు డిమాండ్

కరోనాతోనే కాదు ఇప్పుడు ప్రభుత్వ చర్యలవల్ల కూడా వైద్యం అందక కూడా కొందరు మృతిచెందినట్లు టిడిపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 
kala venkatrao reacts on kurnool  woman death
Author
Amaravathi, First Published Apr 15, 2020, 12:15 PM IST
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని... ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం కూడా సరిగా అందడం లేదని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. కర్నూలు జిల్లాలో సకాలంలో వైద్యం అందక బాలింత ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే నెల్లూరు జిల్లాలో కూడా 
వైద్యం అందక శివ సాగర్ అనే వ్యక్తి చనిపోయాడన్నారు. వైద్యానికి పెద్ద పీట వేస్తున్నాం...వేల కోట్లు కేటాయిస్తున్నామని గంభీరమైన ప్రకటనలు చేస్తున్న  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనలకు ఏం సమాధానం చెప్తారు? వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని బాధ్యత వహిస్తారా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. 

''రాష్ట్రంలో ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు అందని పరిస్థితి నెలకొంది.  లాక్ డౌన్ మొదలయ్యాక ఈ 22 రోజుల్లో అత్యవసర సేవలు అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సేవలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యామ్నాయం చూపడం లేదు. పోయిన ప్రాణాలను పాలకులు తీసుకురాగలరా? వారి కుటుంబాలకు అండగా నిలబడతారా?'' అని నిలదీశారు. 

''కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం కోసం పలానా చర్యలు  తీసుకున్నామని ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలదా? వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఏనాడైనా ప్రభుత్వాసుపత్రులను సందర్శించారా?  రోగులకు అందుతున్న వైద్యం గురించి వాకబు చేశారా?  ఓ వైపు కరోనా మరోవైపు అత్యవసర సేవలు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి, వైద్యశాఖామంత్రికి చీమ కుట్టినట్టయినా లేదు.  మంత్రి ఆళ్ల నాని ఏఏ జిల్లాల్లో ఎన్ని ఆస్పత్రులను సందర్శించారు?'' అని అడిగారు. 

వైద్యులను చులకనగా చూస్తున్న ప్రభుత్వం

''వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడల కారణంగా వైద్యులు ఆస్పత్రులకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రక్షణ పరికరాలు అందివ్వకపోయినా, ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా వృత్తిధర్మం పాటించి ఇన్నాళ్లూ వారు వైద్యం చేశారు. ఇలా ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న  వైద్యులకు దక్కిందేమిటి? వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ పోకడల ఫలితంగా పలువురు వైద్యులు , వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు'' అని అన్నారు. 

''ఎన్ 95 మాస్కులు ఇవ్వండని వైద్యులు అడగటం నేరమా? కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు అందరూ మాస్కులు, గ్లవ్స్ వేసుకుని ఊరంతా తిరుగుతారే... ప్రాణాలకు రక్షణ కల్పించమని వైద్యులు అడిగితే మీకు నచ్చడం లేదా?  వైద్యులంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చులకన భావం కాబట్టే ఇన్ని దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు'' అని మండిపడ్డారు. 

''ప్రయివేట్ ప్రాక్టీసు లేకుండా లక్షలాదిమంది ప్రజలకు ఎన్నో ఏళ్లుగా వైద్యం అందిస్తున్న డాక్టర్ సుధాకర్ ని  మాస్కులు ఇవ్వమని కోరినందుకు సస్పెండ్ చేస్తారా? ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించమని కోరిన నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డిపై వేటు వేస్తారా? ఇదేనా జగనన్న పాలనంటే? ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమా?'' అని నిలదీశారు. 

''ప్రోటోకాల్ పక్కనపెట్టి మంత్రులంతా ఓసారి క్షేత్రస్థాయికి వెళ్లండి...మీరేంటో,  మీ పాలనేంటో ప్రజలు కళ్లకు కట్టినట్టు చెప్తారు. ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడిన  డాక్టర్లు ను, అధికారులను ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే కరోనా భాదితులు, అత్యవసర రోగుల పరిస్థితి ఏంటి? వారికి వైద్య సేవలు ఎవరు అందిస్తారు? వైసీపీ ప్రజాప్రతినిధులలో చాలా మంది డాక్టర్లు ఉన్నారని గతంలో అసెంబ్లీలో జగన్ అన్నారు. మరిప్పుడు వారంతా ఆస్పత్రుల్లో డ్యూటీ లు ఎందుకు చేయడం లేదు? వారికి చిత్తశుద్ది ఉంటే వెంటనే కరోనా భాదితులకు వైద్య సేవలు అందించాలి'' అని సూచించారు.. 

''ప్రశ్నించిన అధికారులపై వేటేస్తారు. ఇవేం సహాయక చర్యలన్న ప్రజలకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు. మీ వైఫల్యాలను ఎత్తి చూపిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తారు. సీబీఐ కోర్టులో అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకుమించి ఏం ఆశించలేమని ప్రజలకు అర్ధమవుతోంది. న్యాయస్థానాలనే బురిడీ కొట్టిస్తున్న పెద్ద మనిషి మనల్ని రక్షిస్తాడు అనుకోవడం అత్యాశే అవుతుందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు.  కరోనా కేసులపై కాకి లెక్కలు చెబుతూ రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థను ధ్వంసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం  ప్రజాగ్రహానికి గురికాక తప్పదు'' అని కళా వెంకట్రావు విమర్శించారు. 


 
Follow Us:
Download App:
  • android
  • ios