అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మంత్రి కళా వెంకటరావు బహిరంగ లేఖ రాశారు. ఆరు పేజీల లేఖలో జగన్ కు ఆయన 23 ప్రశ్నలు సంధించారు. ఈడీ చార్జిషీట్ లో తన భార్య పేరు ఉందంటూ వచ్చిన వార్తలపై జగన్ మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిస్పందనగా కళా వెంకటరావు శనివారం ఆ లేఖ రాశారు.

అవినీతిలో భార్యను భాగస్వామిని చేసి జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. అవినీతి ఆస్తిని భార్య పేరు మీద ఎందుకు పెట్టావని ఆయన జగన్ ను ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడకన సాగడానికి బిజెపితో లాలూచీ పడడం వల్ల కాదా అని అడిగారు. 

కాంగ్రెసుతో లాలూచీ పడి జగన్ బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చారని ఆయన ఆరోపించారు. జగన్ అవినీతితో అధికారులు చార్జిషీట్లను ఎదుర్కోలేదా అని అడిగారు. జగన్ తన అవినీతి సొమ్మును ప్రభుత్వం ద్వారా పేదలకు పంపిణీ చేసి కేసు నుంచి భారతికి విముక్తి కలిగించాలని ఆయన సూచించారు. 

బిజెపితో లాలూచీ పడి అవిశ్వాస తీర్మానానికి ముందే తన పార్టీ లోకసభ సభ్యుల రాజీనామాలను జగన్ ఆమోదింపజేసుకున్నారని అన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీలను గైర్హాజరు చేయించి బిజెపికి సహకరించారని ఆయన జగన్ ను విమర్శించారు. చార్జిషీట్ లో భారతి పేరు ఉంటే తమ పార్టీకి ఏం సంబంధమని ఆయన అడిగారు.