ఏపీ పదో తరగతి ఫలితాలు శనివారం విడుదలైన సంగతి  తెలిసిందే. ఈ పదో తరగతి ఫలితాల్లో ఆరో తరగతి చదువుతున్న  ఓ విద్యార్థిని సత్తా చాటింది. 

ఏపీ పదో తరగతి ఫలితాలు శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పదో తరగతి ఫలితాల్లో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సత్తా చాటింది. ఏకంగా 488 మార్కులు సాధించింది. అదేమిటని అనుకుంటున్నారా?.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.. కాకినాడలో సురేష్-మణి అనే దంపతుల కుమార్తె హేమశ్రీ. చదువులో హేమశ్రీ అద్భుతంగా రాణిస్తోంది. తోటి విద్యార్థులకు మించి ప్రతిభను కనబరించింది. ఈ క్రమంలోనే హేమశ్రీ ప్రతిభను చూసి ఆమెకు చదువు చెబుతున్న ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతిభ గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

అయితే హేమశ్రీ ప్రతిభను పరీక్షించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు.. ఆమెను పదో తరగతి పరీక్షలురాసేందుకు అనుమతించారు. దీంతో హేమశ్రీ ప్రత్యేక అనుమతితో గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా పదో తరగతి ఫలితాలు వెలువడగా.. ఆమె 488 మార్కులు సాధించింది. దీనిపై హేమశ్రీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విజయవాడలో విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 6,09,081 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి చెప్పారు. బాలురలో ఉత్తీర్ణ శాతం.. 69.27 శాతం, బాలికల్లో ఉత్తీర్ణత శాతం.. 75.38 శాతం ఉన్నట్టుగా తెలిపారు. ఉత్తీర్ణతలో పార్వతీపుర్వం మన్యం జిల్లా టాప్‌లో ఉందని.. నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. 

గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. విద్యార్థులకు ఈ నెల 13 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను అవకాశం కల్పిస్తున్నట్టుగా చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఈ నెల 17లోపు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలిపారు.