ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుతో గెలిచిన చాంద్ బాషా.. ఆ తర్వాత అధికార టీడీపీలోకి జంప్ చేశారు. కాగా.. తనతో పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురికి చంద్రబాబు మంత్రి పదువులు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో.. ఈ మంత్రి వర్గ విస్తరణలో తనకు కూడా చోటు దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.

ఈ విషయాన్ని శనివారం ఏపీసీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యి.. ఆయన వద్ద ప్రస్తావించనున్నట్లు తెలిపారు. తన పట్ల పక్షపాతం చూపించవద్దని కోరనున్నట్లు తెలిపారు. కేంద్రంతో విభేదాల నేపథ్యంలో తనను మంత్రి వర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ అభ్యంతరం తెలుపుతారనే ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. కానీ.. అసలు విషయం చంద్రబాబుకి తెలుసునన్నారు.

నాలుగున్నర సంవత్సరాల తర్వాత మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు దక్కడం హర్షనీయమన్నారు. మైనార్టీ కోటాలో గత మంత్రి వర్గ విస్తరణలో కూడా తన పేరు చర్చకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.