అమరావతి: ప్రముఖ జర్నలిస్టు కె. రామచంద్ర మూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ పాలసీ) పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలో ప్రధాన సలహాదారు అజయ్ కల్లంను కలుసుకుని ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేశారు.

తాను రాజీనామా చేస్తానని కేఆర్ మూర్తి చాలా కాలం క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. చేయడానికి పెద్దగా పనేమీ లేదని, ఉత్సవ విగ్రహాంలాంటి పదవిలో ఉండడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పాలనాపరమైన, విధాన నిర్ణయాలు తీసుకునే సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేకపోవడం కూడా ఆయన రాజీనామాకు కారణమని చెబుతున్నారు. ఆయన కుటుంబం హైదరాబాదులో ఉంటోంది. దాంతో విజయవాడ నుంచి పనిచేయడానికి కూడా ఆయన ఇబ్బంది పడినట్లు చెబుతున్నారు.

జర్నలిజంలో విశేష అనుభవం ఉన్న కెఆర్ మూర్తి వివిధ పత్రికల్లో సంపాదకుడిగా పనిచేశారు. ఉదయం దినపత్రికకు, ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. హెచ్ఎంటీవీలో ఉన్నత పదవిని నిర్వహించారు. 

కేఆర్ మూర్తి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందినవారు. జర్నలిజంలో ఆయన తనదంటూ ఓ ముద్రను వేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఆయన క్యాబినెట్ హోదా ఉంది.