శాస్త్రీయత, సామర్థ్యంపై వాస్తవాలు బయటకు వచ్చే వరకు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేయాలని జన విజ్ఞానవేదిక, ప్రజారోగ్య వేదిక ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం నిపుణులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్‌ రమణయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు.

సాధ్యమైనంత త్వరగా ఆయుష్‌, ఐసీఎంఆర్‌ అధికారులు ఈ మందు పనితీరుపై అధ్యయనం జరిపి ఫలితాలు వెల్లడించాలని వారు కోరారు. కరోనా నిబంధనలు పాటించకుండా మందు పంపిణీ చేయడంతో కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ వారు మండిపడ్డారు. ఈ మందు శాస్త్రీయత, సామర్థ్యం నిరూపితమయ్యేవరకు ప్రజల కూడా ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు.  

కరోనాకు ఉచితంగా మందు ఇస్తుండటం, దీనికి తోడు మంచి రిజల్ట్ వచ్చిందన్న ప్రచారంతో జనం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి పోటెత్తిన సంగతి తెలిసిందే. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్‌ పడింది.

Also Read:ఆనందయ్య కరోనా మందు: క్షీణించిన హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్యం

కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందం రానుంది.

కాగా, బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు శుభవార్త చెప్పారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని, మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ నివేదిక వచ్చిందని ఆయన చెప్పారు.

ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నారో పరిశీలిస్తామని రాములు చెప్పారు. ఆనందయ్య కరోనా మందుపై రాములు ఆధ్వర్యంలోనే అధ్యయనం జరుగుతోంది. రాములు ఎదుట ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీని చూపిస్తారు.