ఎంత కష్టమొచ్చిందో ఏమో కానీ.... ఒక జర్నలిస్టు తన కుటుంబంతోసహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోదావరి బ్రిడ్జి పై నుంచి తన, పిల్లలతో సహా నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

ప్రజాశక్తి దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న ముమ్మిడి శ్రీనివాస్ తన కుటుంబంతోసహా యానాంలోని గోదావరి నది బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ విషయం తెలియగానే అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

ఆయన వయసు కేవలం 36 సంవత్సరాలు. పిల్లలు ఇద్దరు కూడా చిన్న పిల్లలు. కుటుంబంతోసహా దూకాడు అనే వార్త దావానంలా వ్యాపించింది. చుట్టుపక్కలప్రాంతాలకు చెందిన చాలా మంది అక్కడికి చేరుకొన్నారు. వారే పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు సంఘటనా  స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. నదిలో మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జర్నలిస్టు ఆత్మహత్యకు ఎందుకు ఒడిగట్టాడు అనే విషయం తెలియాల్సి ఉంది. 

శ్రీనివాస్ అందరితో చాలా మృదువుగా ఉండేవాడని, ఎవరికీ అవసరం వచ్చిందన్న ముందుండి సహాయం చేసేవాడని, సమస్య ఏదైనా ఎత్తి చూపెట్టేవాడని, అలాంటి వ్యక్తి చనిపోవడానికి కారణాలు అంతుచిక్కడంలేదని ఇతర జర్నలిస్టులు అంటున్నారు. 

తోటావారి వీధిలో కుటుంబంతో సహా ఇతడు అద్దెకు ఉంటున్నాడని, పెళ్లై ఆరేళ్లు అయ్యిందని తెలిసింది. హర్ష (5), హరిణి(5) ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వారి కుటుంబంలో ఏవో గొడవలు. శ్రీనివాస్‌పై యానాం పోలీస్‌ స్టేషన్‌లో భార్య కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇదే శ్రీనివాస్ పిల్లలతో సహా చనిపోవడానికి కారణమై ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.