ఏలూరు: ప్రేమోన్మాది దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయింది. మిత్రులతో కలిసి ప్రేమోన్మాది మహిత (19) అనే యువతిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజుగప్ప గ్రామంలో చోటు చేసుకుంది. 

తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో విజయవాడకు చెందిన ఓ యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లి మరీ యువతిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నక్కింటిచెరువువారికి చెందిన పెనుమాల మహిత(19) ఆదివారం తన బంధువుల గ్రామమైన యలమంచిలి మండలం కాజుగప్పకు వచ్చింది. 

రోడ్డుపై నడిచి వెళుతున్న ఆమెపై విజయవాడకు చెందిన కురేళ్ల మహేష్‌ తన స్నేహితులతో కలిసి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడికి ముందు యువతితో అతను వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. మహితపై దాడి చేసిన మహేష్‌ను స్థానికులు బంధించి పోలీసులు అప్పగించారు. మరో ఇద్దరు యువకులు పరారయ్యారు. 

మహేష్ స్పృహ కోల్పోయినట్లు చెబుతున్నారు. అతను స్పృహలోకి వస్తే తప్ప అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదని అంటున్నారు. మృతురాలు మహిత పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆమె తండ్రి అదే కళాశాలలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.