అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనానికి తెర తీశారు. శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. గతంలో నిర్వహించిన పదవి కన్నా తక్కువ స్థాయి పదవికి ఆయన పోటీ పడుతున్నారు. 

తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా నామినేషన్ వేశారు. ఆయన తరఫున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు. కాగా, అదే వార్డులో జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి ప్రస్తుత శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్దన్ పోటీకి దిగారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేపిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బిజెపి - జనసేన కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్న విషయం కూడా తెలిసిందే.

శాసనసభ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు.