అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారు. నీ అంతు చూస్తానంటూ ఆయన సీఐని బెదిరించారు. ట్రాఫిక్ పోలీసుల పట్ల జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు టీవీ చానెళ్లలోప్రసారమయ్యాయి. వాహనాల అక్రమ రిజేస్ట్రేషన్ కేసులో విడుదలై తాడిపత్రికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున అనుచరులు వచ్చారు.

వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులపై, సీఐపై జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు కడప సెంట్రల్ జైలు నుంచి గురువారం విడులైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 13వ తేదీన హైద్రాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. 

 

ఈ విషయమై అనంతపురంలోని జేసీ ఇంటి ముందు జూన్ మొదటివారంలో వాహనాలు కొనుగోలు చేసిన వారు ధర్నాకు దిగారు. మరో వైపు అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న దానిపై కూడా జేసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసి అశ్విత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కొన్ని రోజుల క్రితం వీరు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. దీంతో అనంతపురం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. తండ్రి కొడుకులకు మూడు కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది.కోర్టు ఆదేశాల మేరకు కడప సెంట్రల్ జైలు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను గురువారం సాయంత్రం విడుదల చేశారు.