అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళ తనకు కూతురుతో సమానమని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు వైఎస్ కుటుంబాన్ని గతంలోనే తాను అభినందించినట్లు తెలిపారు. 

షర్మిళను విమర్శించి ఉంటే తనకు పాపం తగులుతుందని జేసీ అన్నారు. వైఎస్‌ కుటుంబం కులాలను రెచ్చగొట్టడంపైనే విమర్శించానని తప్ప షర్మిలపై వ్యాఖ్యలు చేయలేదని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులు కలపడంపై కూడా జేసీ స్పందించారు. కేసీఆర్, జగన్ ఇప్పుడు కలిసి పనిచేయడమేమిటి, ఏడాది నుంచి కలిసే పనిచేస్తున్నారని ఆయన బుధవారంనాడు అన్నారు.

కేసీఆర్ తో కలిసి పది మంది ఎపికి వచ్చినా టీడీపీని చేయగలిగిందేమీ లేదని అన్నారు. రాయలసీమకు వస్తే బీసీలు ఎటువైపు ఉన్నారో చూపిస్తానని అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జేసి దివాకర్‌ రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఉండవల్లిలోని సీఎం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. తమ కుమారులకు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి వారు చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా తమ కుమారులను పోటీకి దింపాలని జేసీ బ్రదర్స్ ఆలోచిస్తున్నారు.