Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ ఆ ఒక్కరికే భయపడుతారు: జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసి దివాకర్ రెడ్డి మరోసారి సెటైర్లు విసిరారు. జగన్ దేశంలో ఎవరి మాట కూడా వినరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

JC Diwakar Reddy says YS Jagan will not hear anyone in the country
Author
Ananthapuram, First Published Jun 1, 2020, 12:00 PM IST

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, తదనంతర పరిణామాలపై స్పందిస్తూ ఆయన జగన్ మీద వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ జగన్ దేశంలో ఎవరి మాటా వినరని, ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే భయపడుతారని ఆయన సోమవార మీడియాతో అన్నారు. వైఎస్ జగన్ కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరని అన్నారు. ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం తప్పు కాదని, అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవిలో కొనసాగించకపోవడం సరి కాదని ఆయన అన్నారు. 

151 మంది ఎమ్మెల్యేలున్నారని నేనే రాజు నేనే మంత్రి అనుకోవడం తప్పు అని ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. జగన్ పాలనకు తాను 110 మార్కులు ఇస్తానని చెప్పారు. ఇప్పటి రాజకీయాల్లో ఉన్నందుకు తాను బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. జగన్ పాలనపై ఇప్పటికే చదువుకున్నవారందరికీ అవగాహనకు వచ్చిందని, మిగతావారికి మరికొద్ది రోజుల్లో అవగాహనకు వస్తుందని జేసీ చెప్పారు.  

రాష్ట్రంలో న్యాయం లేదు, చట్టం లేదని ఆయన అన్నారు. నేనే మంత్రి నేనే మంత్రి అనే పద్ధతిలో జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇంట్లో సత్యాగ్రహం చేస్తే ఏం వస్తుందని ఆయన అన్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో చదువుకున్నవారందరికీ అర్థమైపోయిందని, కాయకష్టం చేసుకునేవారికి కూడా త్వరలోనే అర్థమవుతుందని  ఆయన అన్నారు.

రాజకీయాల్లో నాటికి నేటికీ చాలా మార్చులు వచ్చాయని, బస్సులు జాతీయం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి న్యాయ స్థానం కేవలం సలహా ఇస్తేనే రాజీనామా చేశారని ఆయన అన్నారు. అటువంటి రాజకీయాలను చూసినవాడిని ఇప్పుడు రాజకీయాల్లో ఉండడం బాధగా ఉందని ఆయన అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాజ్యాంగబద్దంగా పాలన సాగించాలని, నేనే రాజు నేను తప్ప ఎవ్వడూ లేడనే పద్ధతి సాగుతోందని ఆయన అన్నారు. 

అమరావతి రాజధాని కోసం అన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వెళ్లలేపోతే ఆయన సన్నిహితులు వెళ్లాలని జేసీ చెప్పారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే ఎస్ఈసీ పదవిలో నియమించాలని హైకోర్టు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఆదేశాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని చెబుతూ ఆయనను పదవికి దూరం పెడుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios