అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. పైలాన్ ఆవిష్కరణ బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానం గురించి చాలాకాలంగా వింటున్నామని ఏ మొగోడు చేయలేదని కానీ దాన్ని చంద్రబాబు చేసి చూపించారన్నారు. 

నదుల అనుసంధానం వల్లే బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లొస్తున్నాయని జేసీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వకుండా మొండిచేయి చూపినా పనులు చేస్తున్నారని ప్రశంసించారు. 

డబ్బులు లేకపోయినా అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్నారని డబ్బులెక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మీ దగ్గరేమైనా అక్షయ పాత్ర ఉందా లేక ఆంధ్రా కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయోనన్న రహస్యం మాత్రం చెప్పాల్సిందేనని జేసీ చంద్రబాబును చమత్కరించారు. 
 
రామలసీమకు ఏ సీఎం ఇవ్వనన్ని ప్రాజెక్టులను చంద్రబాబు ఇచ్చారని, బీడు భూములకు కోట్లు వెచ్చించి నీరు ఇస్తున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. సీమ ప్రజలంతా చంద్రబాబుకు రుణపడి ఉండాలని జేసీ సూచించారు. ఏపీపై కేంద్రం వివక్ష చూపుతున్నా,రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని జేసీ కితాబిచ్చారు.