Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ కు జపాన్ కాన్సులేట్ జనరల్ ఆహ్వానం

రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ మిజుహొ ఇన్ఫర్మేషన్‌ మరియు రీసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోంది. ఈ సందర్భంగా జపాన్ లో పర్యటించాలంటూ జగన్ ను జపాన్ కాన్సులేట్ జనరల్ ఉచియామ ఆహ్వానించారు. 

japan consulate general uchiyama meets ap cm ys jagan to invite visits his country
Author
Amaravathi, First Published Jul 29, 2019, 9:03 PM IST

అమరావతి: జపాన్ లో పర్యటించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలికారు జపాన్ కాన్సులేట్ జనరల్ కొజిరో ఉచియామ. సోమవారం అమరావతిలో సీఎం వైయైస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన ఉచియామ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.  

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో అవినీతిలేని, పారదర్శక పాలన కోసం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు జగన్. పారదర్శకతతో పెట్టుబడులను ఆహ్వానిస్తే భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు స్పష్టం చేశారు.  

పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని సీఎం జగన్ ఆకాక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ విధానాన్ని వివరించారు. 

ఈ విధానం ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకు పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏదశలోనూ లంచాలకు, రెడ్‌టేపిజానికి తావుఉండదని, తాము అండగా ఉంటామని వారికి స్పష్టం చేశారు. 

పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతి, సహృద్భావ వాతావరణం కూడా అవసరమని, దీంట్లో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

నైపుణ్యాభివద్ధి ఉన్న మానవవనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ వివరించారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని, ఆదిశగా పెట్టుబడుల పెట్టే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి జపాన్ కాన్సులేట్ జనరల్ నుకోరారు.

ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమలకోసం భూములు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జగన్ స్పష్టం చేశారు. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 

అత్యాధునిక వసతులున్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్నందున జపాన్‌ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉంటుందని అధికారులు వారికి తెలియజేశారు.  

రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ మిజుహొ ఇన్ఫర్మేషన్‌ మరియు రీసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోంది. ఈ సందర్భంగా జపాన్ లో పర్యటించాలంటూ జగన్ ను జపాన్ కాన్సులేట్ జనరల్ ఉచియామ ఆహ్వానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios