విజయవాడ: అధిక విద్యుత్ బిల్లులు, భూముల వేలంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని... ఇందుకోసం బీజేపీతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జనసేన శ్రేణులకు  ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రజానీకం అంతా కరోనా భయంతో ఉపాధికి దూరమై ఇబ్బందులుపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని ఆలోచించకుండా అధిక విద్యుత్ బిల్లులు జారీ చేస్తోందంటూ మండిపడ్డారు. 

''ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్ ఉన్నవారికీ వేల రూపాయల బిల్లులు జారీ చేయడం చూస్తే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. ఈ విద్యుత్ బిల్ షాక్ పై ప్రజలు ఆందోళన చెందుతున్నా మంత్రులు అలా బిల్లు వేయడాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు'' అని తెలిపారు. 

''మరో వైపు బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేసి ప్రజా ఆస్తులను ప్రైవేట్ పరం చేసేందుకు జీవో ఇచ్చారు. ఆస్తులను అమ్మి రాష్ట్రాన్ని నిర్మిస్తామనడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక చర్యలను జనసేన శ్రేణులు నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొనాలని అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు'' అని తెలిపారు. 

'' మన పార్టీ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని అధిక విద్యుత్ బిల్లులు, భూముల వేలంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలి. అధిక విద్యుత్ బిల్లులను తక్షణం రద్దు చేసి ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని, భూముల వేలానికి సంబంధించిన ఉత్తర్వును రద్దు చేయాలని డిమాండ్ చేయాలి'' అని జనసేన శ్రేణులకు సూచించారు.