రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలవనున్న పవన్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు వీరిద్దరి భేటీ జరగనుంది.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్, ఈ సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారా లోకేష్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఆయనకు సూచించారు. ఏపీ సీఎం జగన్ నియంతంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టడం జగన్ కు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. ఈ నియంత పాలనపై ఐక్యంగా పోరాడుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దీనికి లోకేష్ అంగీకరించారు. తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ALso Read: చంద్రబాబుకు నా మద్ధతు కొనసాగుతుంది.. అన్నిదారులూ క్లోజ్ , అందుకే రోడ్డుపై పడుకున్నా : పవన్
కాగా.. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సోమవారం ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీకి అంతకు ముందు జనసేన మద్దతు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు జనసేన తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘ పత్రిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది.’’ అని పేర్కొన్నారు.
‘‘ రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజాపక్షం వహిస్తూ.. మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుంది. రేపు జరగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవల్సిందిగా కోరుతున్నాను.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.