మీరు డిప్యూటీ సీఎం తాలూకా... అయితే తప్పకుండా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిందే..!!
శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పాలనలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తనదైన మార్క్ పాలన కోసం జనసేనాని చేస్తున్న ప్రయోగాలను ప్రశంసించకుండా వుండలేం...
అమరావతి : పవన్ కల్యాణ్... సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. గతంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకున్న ఈయనో నాయకుడు... ఇదో పార్టీ అంటూ ఎగతాళి చేసిన వారితోనే పోటీచేసిన ఒక్కచోట కూడా ఓటమన్నదే లేదు... ఈయన కదా నాయకుడంటే... ఇది కదా పార్టీ అంటూ ఇప్పుడు పొగిడించుకున్నారు. ఇలా తాను గెలవడమే కాదు జనసేన, టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల గెలుసపులోనూ పవన్ చాలా కీలకపాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వుందంటే అది పవన్ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. స్వయంగా టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు నాయుడే పవన్ కల్యాణ్ వల్లే ఇంతటి అద్భుత విజయం సాధ్యమయ్యిందని చెప్పుకొచ్చారు.
అయితే పవన్ కల్యాణ్ కు ఈ విజయం అంత ఈజీగా రాలేదు. పదేళ్ళకు పైగా పట్టువదలని విక్రమార్కుడిలా రాజకీయాలను సాగించారు... దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ అవమానించినా తట్టుకున్నారు... మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత జీవితంపై విమర్శలను సైతం భరించారు. ఇలా ప్రత్యర్థులు తనను హేళన చేస్తున్నా పట్టించుకోకుండా రాజకీయాల్లోనే వుంటూ అనుభవం గడించారు... అదే ఆయనను విజేతగా నిలిపింది. గత రాజకీయ అనుభవంతోనే ఒంటరిగా వెళితే వైఎస్ జగన్ ను కొట్టలేమని పవన్ గ్రహించారు... అందువల్లే తాను తగ్గిమరీ టిడిపి, బిజెపిలతో పొత్తు పెట్టుకున్నారు...కూటమిని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపి విజేతగా నిలిపారు. ఇలా ఎక్కడ తగ్గాలో... ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు పవన్ కల్యాణ్.
అయితే ఇంతకాలం పవన్ కు రాజకీయ అనుభవం లేదన్నవారే ఇప్పుడాయన డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పాలనా అనుభవం లేదంటూ కొత్తరాగం అందుకున్నారు. వీటిని కూడా విమర్శలుగా తీసుకోవడం లేదాయన... రాజకీయాల్లో మాదిరిగానే పాలనపైనా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఏమాత్రం నామోషీ లేకుండా ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇలా తనదైన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు పవన్ కల్యాణ్.
పాలనలోనూ క్యూఆర్ కోడ్ ..:
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే ఏర్పడిన చంద్రబాబు కేబినెట్ లో పవన్ కల్యాణ్ తో పాటు మరో ఇద్దరు జనసైనికులకు మంత్రులుగా అవకాశం దక్కింది. పవన్ డిప్యూటీ సీఎంగానే కాదు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక మరో సీనియర్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాలు, కందుల దుర్గేష్ టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో నాదెండ్ల మినహా పవన్, దుర్గేష్ ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మంత్రులే. వీరిని పాలనా అనుభవం లేదు కాబట్టి ప్రజల సహకారం కోరుతున్నారు. ప్రజల ద్వారానే సుపరిపాలన అందించేందుకు సిద్దమయ్యారు.
తాజాగా జనసేన మంత్రులు పవన్, నాదెండ్ల, దుర్గేష్ లు చేపట్టిన శాఖల గురించి ఎవయినా సలహాలు,సూచనలు వుంటే చేసే అవకాశం కల్పించారు. టెక్నాలజీని పాలనాపరమైన వ్యవహారాల్లో ఉపయోగిస్తోంది జనసేన. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడంద్వారా స్వయంగా పవన్ కల్యాణ్ కు పాలనాపరమైన సూచనలిచ్చే అవకాశం కల్పించారు. ఈ మేరకు పార్టీ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ క్యూఆర్ కోడ్ ను పోస్ట్ చేసారు.
పవన్ కు పాలనాపరమైన సలహాలు ఎలా ఇవ్వాలంటే...!!
జనసేన అధికారికంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఓ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన వివరాలను తెలపుతూ ఏ శాఖకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాలో సెలెక్ట్ చేయాలి. ఇలా ప్రజలను కూడా పాలనలో భాగస్వామ్యం చేస్తోంది జనసేన పార్టీ.
రాజకీయాల్లో మాదిరిగానే పాలనలోనూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచేందుకు జనసైనికులు, మెగా ఫ్యాన్స్ సిద్దమయ్యారు. ఇందుకోసం జనసేన పాలనాలో ప్రజాసాయం కోరుతూ విడుదలచేసిన క్యూఆర్ కోడ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ వీలైనంత ఎక్కువమందికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.