రాజోలు: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ఫిదా అయిపోయారు. అసెంబ్లీలో ప్రశంసలతో ముంచెత్తిన రాపాక వరప్రసాదరావు ఈసారి ఏకంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ముగ్ధుడై పాలాభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

ఇటీవలే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైయస్ఆర్ వాహన మిత్ర పథకంపై రాపాక వరప్రసాదరావు ప్రశంసలు కురిపించారు. ప్రతీఏడాది ఆటోవాలాలకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేయడం గొప్ప పరిణామమంటూ కొనియాడారు. 

సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సొంత నియోజకవర్గమైన అమలాపురం నియోజకవర్గం నల్లవంతెన వద్ద సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 

వైయస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపేందుకు నియోజకవర్గానికి చెందిన ఆటో, కారు డ్రైవర్లు ఈ కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. మంత్రి విశ్వరూప్ ఇలాకాలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరయ్యారు.  

మంత్రి పినిపే విశ్వరూప్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా రాపాక పాల్గొనడంతోపాటు సీఎం జగన్ కు పాలాభిషేకం చేయడంపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది.   

అంతేకాదు సభలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి,  అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఆటో డ్రైవర్లకు న్యాయం చేయటం అద్భుతమంటూ అభివర్ణించారు. ప్రజల సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని తెగ పొగిడేశారు. 

అక్కడితో ఆగిపోలేదు ఆటోడ్రైవర్లతో కలిసి వైఎస్ జగన్ కు అనుకూలంగా నినాదాలు సైతం చేశారు. వైఎస్ జగన్‌ను మనసున్న నాయకుడిగా అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. 

రాష్ట్ర బడ్జెట్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ జగన్ కట్టుబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారని ప్రశసించారు. 

ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలను ఎన్నికల సంవత్సరంలో అమలు చేసే ప్రభుత్వాలను తాను ఇప్పటి వరకు చూశానని, దానికి భిన్నంగా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. 

ఇకపోతే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పొలిటికల్ బ్యూరో సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన దారుణంగా ఉందంటూ తిట్టిపోశారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాలాభిషేకం చేయడం పాలన భేష్ అంటూ కితాబివ్వడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీలోకి చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జనసేనలో భవిష్యత్తు లేదని రాపాక వరప్రసాదరావు వైసీపీలో చేరతారని అందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 

సోషల్ మీడియాలో ప్రచారానికి తగ్గట్లుగానే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ను తెగ పొగిడేశారు రాపాక వరప్రసాదరావు. అటు వైసీపీ నేతలు సైతం రాపాక వరప్రసాదరావును సైతం ప్రశంసించారు. 

ఇకపోతే ఇటీవల కాలంలో జనసేన పార్టీకి ఒక్కొక్కరూ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ కీలక నేతలు వైసీపీ, బీజేపీ గూటికి చేరిపోతుండటంతో  ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. భవిష్యత్ రాజకీయం కోసమే నేతలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. 

రాపాక వరప్రసాదరావు సైతం అదేతోవలో ప్రయాణిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి రాపాక వరప్రసాదరావును  రాజకీయాల్లోకి ఆహ్వానించింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 

2009లో రాజోలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు ఘన విజయం సాధించారు. ఆనాటి నుంచి వైయస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అభినందించారు కూడా.  

అయితే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సీఎం జగన్ కు పాలాభిషేకం చేయడం మామూలు అంశమేనని  ఆయన అభిమానులు చెప్తున్నారు. అందులో తప్పేమీ లేదన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే ప్రశంసిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ మెుదట్లోనే చెప్పారని ఆయన చెప్పినట్లే రాపాక నడుచుకున్నారని అందులో రాజకీయ కోణం ఏమీ లేదంటున్నారు.