ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా చేసిన ప్రసంగంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సెటైర్లు విసిరారు.
హైదరాబాద్ : రైతు భరోసా నిధుల విడుదల సందర్బంగా గుంటూరు జిల్లా తెనాలిలో ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సెటైర్లు విసిరారు. ప్రతిసారీ జగన్ మీ బిడ్డనని ప్రజలతో అంటారు... సొంత కుటుంబసభ్యులే నమ్మని ఆయన జనం బిడ్డ ఎలా అవుతారని అన్నారు. సొంత తల్లి, చెల్లి వద్దన్న బిడ్డ జగన్... అలాంటి ఆయనను ఏ కుటుంబమూ ఒప్పుకోదని అన్నారు. కాబట్టి ఇకనైనా సీఎం జగన్ పదేపదే మీ బిడ్డను అంటూ మాట్లాడటం ఆపాలని నాదెండ్ల సూచించారు.
హైదరాబాద్ లోని జనసేన పార్టీ జాతీయ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. తెనాలిలో జరిగిన రైతు భరోసా సభకు సీఎం జగన్ హెలికాప్టర్ లో వెళ్లడాన్ని నాదెండ్ల తప్పుబట్టారు. తాడేపల్లిలోని సీఎం నివాసం నుండి తెనాలి కేవలం 26 కిలో మీటర్లే... కనీసం ఇక్కడికి కూడా రోడ్డు మార్గంలో వెళ్లకుండా ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్ల గురించి తెలుసుకునే తీరిక కూడా లేదా? అని నాదెండ్ల ప్రశ్నించారు.
గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తే కొత్త రోడ్లు వేస్తారనే ఆశ జనంలో ఉండేదని.. ఈ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తిరగడంతో ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి హెలికాప్టర్ వదలి రోడ్డు బాట పట్టాలని... జనం బాధలను గమనించాలని కోరుకుంటున్నాం అని నాదెండ్ల అన్నారు.
Read More కరువుతో బాబుకు స్నేహం, మాకు వరుణుడి ఆశీస్సులు: ఏపీ సీఎం జగన్
తెనాలి సభ కోసం 450 ఆర్టీసీ బస్సులు ఉపయోగించారు... ప్రైవేటు పాఠశాలల బస్సులను వదల్లేదని నాదెండ్ల అన్నారు. వారం రోజుల క్రితమే వాలంటీర్లకు, డ్వాక్రా సంఘాలకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు...చివరకు సీఎం సభలో చప్పట్లు ఎప్పుడు కొట్టాలి..? ఈలలు ఎప్పుడు వేయాలో కూడా శిక్షణ ఇచ్చి తీసుకెళ్లారని అన్నారు. టార్గెట్లు పెట్టి, బెదిరించి జనాన్ని తీసుకొచ్చారని నాదెండ్ల అన్నారు.
తెనాలిలో కరెంటు కట్ చేసి, ఆస్పత్రిలో జనం చనిపోయేలా చేశారని నాదెండ్ల ఆరోపించారు. ఇవన్నీ చేసి సభలు పెట్టుకొని మీ జబ్బలు మీరే చరుచుకోవడమే మీ నైజం అంటూ వైసిపి నాయకులను ఎద్దేవా చేసారు. ఒక్క కుటుంబానికి ఉపయోగపడని సభలతో అల్లకల్లోలం చేస్తున్నారన్నారు.
