హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్. మహిళా అధికారులపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని నిలదీశారు. 

తమ పార్టీకి చెందిన నేత రియల్ ఎస్టేట్ భూములకు  కుళాయి కనెక్షన్ ఇవ్వడం ఆలస్యం అయ్యిందని ఇంటికి వెళ్లి కరెంట్ కట్ చేసి, పైప్ లైన్ తవ్వి భయటపెట్టిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. 

గతంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహాశీల్థార్ వనజాక్షిపై దాడికి పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వంలో ఎంపీడీవో సరళపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని మండిపడ్డారు. 

పాలకులు మారినా మహిళా అధికారులపై ఆగడాలు మాత్రం ఆగడం లేదన్నారు. అధికారులపై అవే దాడులు, దాష్టీకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నాటి పాలకుల అడుగుజాడ్లో నడుస్తూ అధికార అహంకారంతో దాడులు చేస్తున్నారంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. 

ఎంపీడీవో సరళపై వైసీపీ ఎమ్మెల్యే దాడికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజాప్రతినిధులే చట్టాన్ని గౌరవించకపోతే విలువ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. 

సమస్యలపై రోడ్డు ఎక్కి పోరాటాలు చేస్తుంటే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్న జగన్ ప్రభుత్వం మహిళా అధికారులపై దాడి చేసిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 

మహిళా ఉద్యోగి సరళపై దాడికి పాల్పడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సెక్షన్ 448, 421 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా ఇవేం సెక్షన్లు అంటూ నిలదీశారు. మహిళ ఉద్యోగిపై దాడికి పాల్పడితే బెయిల్ రాని కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.  ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు.