ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. శాసనసభ సమావేశాలు తొలిరోజు సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో జగన్‌తో ముచ్చటించారు.

సీఎంగా తొలిసారి శాసనసభకు వచ్చిన జగన్‌ను మర్యాదపూర్వకంగా పలకరించి, అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని కొనియాడారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ముఖ్యమంత్రికి సహాయ సహాకారాలు అందిస్తామని రాపాక స్పష్టం చేశారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన గెలిచిన సంగతి తెలిసిందే.