జనసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఊహించని షాకిచ్చారు. తాను కాకుండా తన కుమారుడికి వైసీపీ జెండా కప్పించారు. రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్‌ రామ్‌ శుక్రవారం వైసీపీలో చేరారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా కండువా కప్పి వెంకట్ రామ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాపాక వరప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

కాగా, రాపాక వరప్రసాద్ రావు మొదటి నుంచి జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ అని చెప్పిన ఆయన.. అది ఎప్పటివరకు ఉంటుందో తెలియదన్నారు.

కేవలం పోటీలో ఉండాలి కాబట్టే జనసేనలో చేరారని రాపాక వరప్రసాద్ వెల్లడించారు. జనసేన తరపున గెలిచినా తన ప్రయాణం అంతా వైసీపీతోనే అని ఆయన ఎన్నోసార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.