జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని, ఆయన వెంట యువశక్తి ఉందని పార్టీ నేత నాగబాబు అన్నారు. బ్రహ్మ రాక్షసుడ్ని గద్దె దించాలంటే.. అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీకి లేని యువశక్తి జనసేన పార్టీకి ఉందనీ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు వ్యాఖ్యానించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని, ఆయన వెంట యువశక్తి ఉందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి లేని యువశక్తి జనసేన పార్టీకి ఉందనీ, ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే అద్భుత మార్పును తీసుకురాగలుగుతామని అన్నారు. పార్టీ సీనియర్లు యువతతో కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, రాజకీయాల్లో కొత్తతరాన్ని ప్రోత్సహించకపోతే పార్టీ నష్టపోతుందని సూచించారు. 

మనం యుద్ధం చేయబోతున్నది ఒక బ్రహ్మరాక్షసుడితోననీ, మనలో మనం కొట్టుకొని పలుచన కాకుండా.. అందరం ఒక్క తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే ఆ బ్రహ్మరాక్షసుడిని గద్దె దించడం పెద్ద కష్టం కాదని అన్నారు. నిస్వార్ధమైన నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తున్నామనీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనం కోసం, రాష్ట్రం కోసం పోటీ చేయకుండా నిస్వార్ధంగా బీజేపీ, టీడీపీకి మద్దతు తెలిపారని అన్నారు. ఆయన వ్యక్తిత్వం నుంచి ఎంతో కొంత తీసుకొని పాటిస్తే మనుషులుగా మనం గొప్పగా ఎదుగుతామని అన్నారు. 

పవన్ కళ్యాణ్ తన తల్లి దిగులు చెందుతుందనీ.. ఆ తల్లికి తాను ఎప్పుడే ఓ మాట చెప్పుతానని, కళారంగానికి అన్నయ్యను, సమాజానికి కళ్యాణ్ ను వదిలేయ్.. అక్కడ వాళ్లను కోట్లాది మంది ఆరాధిస్తున్నారని, వారికి నీలాంటి ఎందరో తల్లుల ఆశీర్వాద బలం వాళ్లకు ఉందని ఓదార్చానని తెలిపారు. యూకే, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, అబ్రాడ్‌లో కూడా జనసేన నాయకులు పని‌ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. గతంలో ఒక వ్యక్తి, పార్టీని చూసి ఓటు వేశారు... తర్వాత తండ్రిని చూసి కొడుక్కి ఓటు వేశారు. ఇప్పుడు మీ పిల్లలు భవిష్యత్తు చూసి.. పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయండి.’’ అని నాగబాబు సూచించారు.