Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్రపై సర్కార్ నిర్లక్ష్యం.. కేవలం శంకుస్థాపనలే, అభివృద్ధి నిల్ : జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

ఏపీలోని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఉత్తరాంధ్రను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయ్యిందని ఆయన దుయ్యబట్టారు. 

janasena leader nadendla manohar slams ap cm ys jagan over uttarandhra development
Author
First Published Jan 7, 2023, 3:34 PM IST

ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమల అభివృద్ధికి డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ అని అన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయ్యిందని నాదెండ్ల దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు కోచింగ్ తదితర అవసరాల కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. 

అంతకుముందు రెండ్రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని నాదెండ్ల ఆరోపించారు.జగన్‌కు సాయం అందించడానికి, జనసేన ఓట్లు చీల్చడానికే బీఆర్ఎస్ తెచ్చారని మనోహర్ వ్యాఖ్యానించారు.  ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ చీలిక తెచ్చిందని.. బీఆర్ఎస్‌తో ఏపీకి ఎలా న్యాయం చేస్తారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 175కి 175 సీట్లు గెలుస్తామంటోన్న సీఎం జగన్ ప్రతిపక్షాలకు భయపడుతున్నారని నాదెండ్ల నిలదీశారు. జనసేన కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. డీజీపికి ఇప్పటికే యువశక్తి కార్యక్రమం గురించి తెలియజేశామని.. జనవరి 12న రణస్థలంలో యువశక్తి కార్యక్రమం జరుపుతున్నామని నాదెండ్ల పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర యువత, మత్స్యకారుల సమస్యలపై చర్చ జరుగుతుందని మనోహర్ స్పష్టం చేశారు. 

ALso REad: జగన్ కోసమే బీఆర్ఎస్... కేసీఆర్ ప్లాన్ అదే : నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

కాగా.. కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేరికలు మొదలైన సంగతి తెలిసిందే. తొలుత తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి సహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందుకు సంబంధించి తెర వెనక కొంతకాలంగా మంతనాలు సాగినట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించి కేసీఆర్ ఓ ప్రణాళిక రూపొందించారనే బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్‌ వైఖరి ప్రకటించడంతో.. తాము ఏ విధంగా అభివృద్ది చేస్తామని చెప్పడం ద్వారా ప్రజల నుంచి ఆదరణ పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని కొన్ని ప్రధాన అంశాలపై కేసీఆర్ ఓ స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.అయితే మరికొన్ని విషయాలపై మాత్రం బీఆర్ఎస్ వైఖరి ఏమిటనే ఆసక్తి నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios