ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జనసేన కిరణ్ రాయల్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసే పార్టీ ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కిరణ్ రాయల్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు చిత్తూరు కోర్టు శనివారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద కిరణ్ రాయల్‌కు నోటీసును అందజేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో శనివారం మధ్యాహ్నం కిరణ్ రాయల్ విడుదలయ్యారు. దీంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 

అనంతరం కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు అధికార పార్టీ, మంత్రి రోజా పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రోజా కక్షగట్టుకొని గత నెల 18వ తేదీన నగిరి పోలీసు స్టేషన్‌లో తనపై కేసు నమోదు చేయించారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి తనను ఘోరంగా అరెస్ట్ చేవారని చెప్పారు. సివిల్ దుస్తులు ధరించిన 11 మంది పోలీసులు తన ఇంటిపై దాడి చేసి బలవంతంగా తీసుకెళ్లారని చెప్పారు. వాళ్ళెవరూ పోలీసులమని తనకు చెప్పలేదని అన్నారు. తనను కిడ్నాప్ చేసి చంపేస్తారని ఊహించానని చెప్పారు. గంటకు పైగా తిరుపతిలోనే తిప్పి రాత్రి 10. 30 గంటలకు నగిరి తీసుకెళ్లారని తెలిపారు.

ఓ కానిస్టేబుల్ ఫోన్ నుంచి మంత్రి రోజా తనతో మాట్లాడరని చెప్పారు. ఆమెను దూషించినందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పారని.. అయితే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడారు కదా? అని తాను బదులిచ్చినట్టుగా తెలిపారు. తన అరెస్ట్ కు మంత్రి రోజా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి‌లు కారణమని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే మంత్రి రోజాదే బాధ్యత అని అన్నారు. ఎలాగైతే నన్ను చెప్పుల్లేకుండా తీసుకువచ్చి ఏ స్టేషన్‌లో అయితే కూర్చోబెట్టారో... అదే స్టేషన్ లో 18 నెలల్లో రోజాను కూర్చొబెడతా అని అన్నారు. 

జనసేన పార్టీ జిల్లా ఇన్‌చార్జి పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. కిరణ్ రాయల్ విడుదలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేశారని చెప్పారు. ఇదిలా ఉంటే.. కిరణ్ రాయల్ బెయిల్‌పై విడుదలైన అనంతరం ర్యాలీ నిర్వహించిన జనసేన నేతలు.. మంత్రి రోజా ఇంటి ముందు తొడకొట్టారు.