తిరుపతిలో జరిగిన కార్యకర్తల సభలో వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి దానికి వైసీపీ రంగుల్ని వేశారని.. కేవలం ఏడుకొండల వాడికి మాత్రమేనంటూ ఆయన సెటైర్లు వేశారు.

తాను ఎవరిని వెనకేసుకురానని, ఎవరికీ అండగా ఉండనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శబరిమలలో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని.. దానిని ఒక ఆచారంగానే చూడాలి కానీ, వివాదం చేయొద్దంటూ పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Also Read:రేపిస్టులను తోలు ఊడేవరకు కొట్టాలి: దిశా ఘటనపై పవన్ స్పందన

రాయలసీమలో దళితులతో పాటు మిగిలిన వారిపై దాడులు జరుగుతున్నాయని.. దానిని ప్రశ్నించేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో అన్యమత ప్రచారానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాను సంపూర్ణ మద్ధతు తెలుపుతానని.. మతాల పట్ల చీలిక తెచ్చింది హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు.

మతం మారినా కులాలు మారడం లేదని.. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని జగన్‌పై మండిపడ్డారు. తన పేరు వెనుక నాయుడు లేదని దానిని వైసీపీ నేతలే పెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీది రంగుల రాజ్యమని పవన్ మండిపడ్డారు. 

దిశా ఘటనపై జనసేన అధినేత స్పందించారు. రేపిస్టులను తోలు ఊడేవరకు కొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఓ నలుగురు కామాంధులు ఓ యువతిని నడిరోడ్డుపైనే కిడ్నాప్ చేసి అత్యాచారం చేసే స్థాయికి మన సమాజం చేరిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అక్కాచెల్లెళ్ల మధ్య పుట్టి పెరిగానని.. ఆడబిడ్డ ఇంటి నుంచి బయటకెళ్లొచ్చిన తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి పడే బాధ తనకు తెలుసునన్నారు. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు కొందరు జూనియర్ ఆర్టిస్టులు వేధింపులు ఎదుర్కొవడం తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.

అలాంటి పరిస్ధితుల్లో వాళ్లు ఇళ్లకు వెళ్లేసరికి కర్ర పట్టుకుని నిల్చొనేవాడినని, లేదంటే తన కారు ఇచ్చి పంపించేవాడినని పవన్ గుర్తు చేశారు. మన ఇంటి, సమాజంలోని ఆడబిడ్డల మాన, ప్రాణాలను రక్షించలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటని జనసేనాని ప్రశ్నించారు. నాయకులు ఇలా ఉండబట్టే కొందరు ఆడపిల్లలపై రెచ్చిపోతున్నారని పవన్ ఆరోపించారు. 

Also Read:జగన్ కులం, మతంపై పవన్ వ్యాఖ్యలు: వైఎస్ జగన్ కౌంటర్

కర్నూలులో సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి ఉదంతాన్ని పవన్ గుర్తుచేశారు. ఈ ఘటనలో ఆ పాప అత్యాచారానికి గురై మరణించడం వల్లే చనిపోయిందని ఆధారాలు చెబుతుంటే.. రెండు రోజుల క్రితం అలాంటిదేమి జరగలేదని ప్రకటన వచ్చిందని జనసేనాని వెల్లడించారు